Chiranjeevi: 'సైరా' మార్కెట్ విలువలో 10 శాతం ఇస్తామన్నారు... మాకు రూ.50 కోట్లు రావాలి: ఉయ్యాలవాడ బంధువులు
- ముదురుతున్న సైరా వివాదం
- పోలీసులను ఆశ్రయించిన ఉయ్యాలవాడ వంశీయులు
- సినిమా అయిపోయిందని చెప్పి మాట తప్పుతున్నారని ఆవేదన
మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని చేసిన 'సైరా' చిత్రం విడుదలకు దగ్గరపడుతున్న దశలో వివాదాల బారిన పడింది. చిరంజీవి, రామ్ చరణ్ తమను మోసం చేశారంటూ ఉయ్యాలవాడ వంశీయులు పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, తమను చిరంజీవి, రామ్ చరణ్ ఛీటింగ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా కోసం తమతో రామ్ చరణ్ స్వయంగా మాట్లాడాడని, నోటరీపై 22 మందితో సంతకాలు చేయించారని వెల్లడించారు. సైరా మార్కెట్ విలువలో 10 శాతం ఇస్తామని మాటిచ్చారని, ఆ లెక్కన తమకు రూ.50 కోట్లు రావాల్సి ఉందని అన్నారు. కానీ, ఇప్పుడు సినిమా అయిపోయిందని చెబుతూ మాట తప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సినిమా షూటింగ్ సమయంలో తమ ఆస్తులు, స్థలాలను వాడుకున్నారని ఆరోపించారు. తమను ఆర్థికంగా ఆదుకోవాలని రామ్ చరణ్ ను, దర్శకుడ్ని కోరామని వారు తెలిపారు. ఆదుకోకపోగా, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ చిత్రయూనిట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. న్యాయం జరిగేవరకు ఆందోళన విరమించేది లేదని, చిరంజీవి, రామ్ చరణ్ లపై కేసు నమోదు చేయాల్సిందేనని ఉయ్యాలవాడ వంశీయులు అంటున్నారు.