Crime News: 'పేరు'తో వచ్చిన తిప్పలు.. అసలు నిందితుడి బదులు మరొకర్ని జైల్లో పెట్టిన పోలీసులు!
- పీడీ యాక్టుపై జైల్లో ఉన్న వ్యక్తిపై చోరీ కేసు
- తనకు సంబంధం లేదన్నా పట్టించుకోని పోలీసులు
- పేరు ఒక్కటైన పాపానికి ఇక్కట్లు
అతని పేరు తోట వేణు. రామగుండం మండలం గోదావరి ఖనికి చెందిన టీఆర్‌ఎస్ మాజీ కార్పొరేటర్ కొడుకు. 38 ఏళ్ల తోట వేణుపై దాడులు, బెదిరింపు కేసులు ఉండడంతో పోలీసులు పీడీ యాక్ట్‌పై కేసు పెట్టి వరంగల్ జైలుకు పంపారు. ఇదే పేరుతో ఉన్న మరో తోట వేణుపై ఉన్న చోరీ కేసు విచారణ చేపట్టిన పోలీసులు ఇతన్ని అరెస్టు చేయడం వివాదమయ్యింది.
వివరాల్లోకివెళితే...గత ఏడాది ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం పరిధిలో ఓ చోరీ కేసు నమోదయ్యింది. ఈ కేసులో నిందితులైన దుర్గాప్రసాద్, కాసశ్రీనివాస్‌ను పోలీసులు బెంగళూరులో అరెస్టుచేసి చోరీ చేసిన వస్తువుల్లో కొన్ని స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వస్తువుల కోసం ప్రశ్నించగా తమకు రాజమండ్రి జైలులో పరిచయం అయిన తెంగాణలోని పెద్దపల్లి పట్టణానికి చెందిన స్మగ్లర్లు అరికె శ్యామ్, తోట వేణుకు ఇచ్చినట్లు తెలిపారు.
దీంతో పీడీ యాక్ట్‌పై వరంగల్ జైలులో ఉన్న తోట వేణు (38), వీరు చెప్పిన తోట వేణు(25) ఒక్కరే అనుకుని రావులపాలెం పోలీసులు గోదావరిఖని వేణుపై కేసు నమోదు చేసి తమ అధీనంలోకి తీసుకున్నారు. పీడీ యాక్ట్ కేసు నుంచే ఎలా బయటపడాలా? అని సతమతమవుతున్న వేణు కుటుంబానికి, కొత్త కేసు చుట్టుకోవడంతో ఆవేదన చెందారు. ‘నామీద ఎటువంటి చోరీ కేసులు లేవు. నేనెప్పుడూ రాజమండ్రి జైలుకు వెళ్లలేదు’ అని చెబుతున్నా పోలీసులు పట్టించుకోలేదు.
దీంతో ఆధారాలతో సహా అతను విషయం బయటపెట్టడంతో పోలీసులు నాలిక కరుచుకున్నారు. ఇంతకీ పోలీసులు వెతుకుతున్న తోట వేణుది పెద్దపల్లి పట్టణంలోని భరత్‌నగర్. అతని వయసు 25 సంవత్సరాలు. ఈ వివరాలు గోదావరి ఖని వేణు బయటపెట్టడంతో పోలీసులు తప్పిదాన్ని గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకుని ఇతన్ని విడిచిపెట్టారు. అయితే రావులపాలెం పోలీసుల వైఖరిపై వేణు సోదరుడు శ్రీనివాస్ ఏపీ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం విచారణ జరుగుతోంది.