Valmiki: 'వాల్మీకి' సినిమా పేరు మార్పు వెనుక అనంతపురం ఎంపీ హస్తం!
- ప్రకాశ్ జవదేకర్ దృష్టికి టైటిల్ వివాదం అంశాన్ని తీసుకెళ్లిన తలారి రంగయ్య
- ఓ మహనీయుడి పేరును ఫ్యాక్షన్ తరహా చిత్రాలకు పెట్టారంటూ అభ్యంతరం
- తమకు ఎవరితో శత్రుత్వం లేదన్న తలారి రంగయ్య
వరుణ్ తేజ్, పూజా హెగ్డే కాంబినేషన్ లో తెరకెక్కిన 'గద్దలకొండ గణేశ్' చిత్రం నిన్న విడుదలై... మంచి టాక్ ను సంపాదించుకుంది. వాస్తవానికి ఈ చిత్రం అసలు పేరు 'వాల్మీకి' అనే విషయం తెలిసిందే. కొందరి మనోభావాలు దెబ్బతినడంతో ఈ చిత్రం పేరును మార్చారు.
మరోవైపు, 'వాల్మీకి' పేరును మార్చడంలో అనంతపురం ఎంపీ తలారి రంగయ్య కీలక పాత్ర పోషించారు. ఈ పేరు వ్యవహారాన్ని ఆయన కేంద్ర మంత్రి జవదేకర్ దృష్టికి తీసుకెళ్లారు. వాల్మీకిలాంటి మహనీయుడి పేరును ఫ్యాక్షన్ తరహా చిత్రాలకు పెట్టడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, చిత్ర యూనిట్ సభ్యులు టైటిల్ ను మార్చారు. ఈ సందర్భంగా తలారి రంగయ్య మాట్లాడుతూ, వాల్మీకి పేరును మార్చిన తర్వాత... ఈ చిత్రాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. తమకు ఎవరితోనూ శత్రుత్వం లేదని తెలిపారు.