Karnataka: ఎరక్కపోయి సెల్ఫీ తీసుకుని.. ఇరుక్కుపోయిన పర్యాటకుడు!
- హంపీ పర్యటనకు వెళ్లిన పర్యాటకుడు
- సెల్ఫీ తీసుకునే క్రమంలో నేల కూలిన స్తంభాలు
- అరెస్ట్ చేసిన పోలీసులు
స్నేహితులతో కలిసి సరదాగా ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హంపి వెళ్లిన ఓ వ్యక్తి చిక్కుల్లో పడ్డాడు. అక్కడ సెల్ఫీ తీసుకునే క్రమంలో పురాతన స్తంభాలు రెండు నేల కూలడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని బళ్లారి జిల్లా హంపిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరుకు చెందిన నాగరాజ్ (45) తన మిత్రులతో కలిసి హంపి సందర్శనకు వెళ్లాడు. అక్కడ చారిత్రక కట్టడాలను చూస్తూ ముచ్చటపడ్డాడు. విజయ విఠల ఆలయంలోని సాల మంటపాన్ని చూసి మైమరచిపోయాడు. అక్కడి స్తంభాల వద్ద సెల్ఫీ తీసుకోవాలని ఆరాటపడ్డాడు.
ఓ స్తంభానికి ఆనుకుని సెల్ఫీ దిగుతుండగా అది కాస్తా నేలకూలింది. అది తగిలి మరో స్తంభం కూడా కిందపడింది. దీంతో అవాక్కవడం నాగరాజ్ వంతు అయింది. అయితే, పెద్ద శబ్దంతో స్తంభాలు నేలకూలడంతో అక్కడి భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పురావస్తు శాఖ అధికారుల ఫిర్యాదుతో నాగరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు స్తంభాలు పడిపోవడానికి కారణం నాగరాజే కారణం కావడంతో మిగతా వారిని వదిలిపెట్టారు.
ఈ సందర్భంగా బళ్లారి ఎస్పీ సీకే బాబా మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు స్తంభాలు ఉన్న ప్రాంతంలోని నేల వదులుగా మారిందని, నాగరాజ్ స్తంభంపై చేయి వేయగానే అది కిందపడిందని, ఈ క్రమంలో మరో స్తంభానికి తాకి అది కూడా కూలిందని తెలిపారు. అనుకోకుండా జరిగిన ఘటనే అయినప్పటికీ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేయక తప్పలేదని ఎస్పీ వివరించారు.