GST: తగ్గింపులే తగ్గింపులు... అనేక వస్తువులపై జీఎస్టీ సవరించిన కేంద్రం

  • చింతపండుపై జీఎస్టీ ఎత్తివేత
  • వెట్ గ్రైండర్లపై జీఎస్టీ 5 శాతానికి తగ్గింపు
  • దిగుమతి చేసుకునే రక్షణ రంగ ఉత్పత్తులపై 2024 వరకు మినహాయింపు

బడ్జెట్ లో కార్పొరేట్ వర్గాలను కనికరించనట్టుగా కనిపించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్రమంగా సడలింపు ధోరణి ప్రదర్శిస్తున్నారు. దేశీయ కంపెనీలపై కార్పొరేట్ పన్ను తగ్గించిన కేంద్రం, తాజాగా అనేక వస్తువులపై జీఎస్టీ రేట్లను సవరించింది. మెరైన్ ఇంధనంపై జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి తగ్గిస్తున్నట్టు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. చింతపండుపై 5 శాతం ఉన్న జీఎస్టీని పూర్తిగా ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. వెట్ గ్రైండర్లపై ఉన్న 12 శాతం జీఎస్టీని 5 శాతం తగ్గిస్తున్నామని చెప్పారు.

ఇక, దిగుమతి చేసుకునే రక్షణరంగ ఉత్పత్తులకు 2024 వరకు పన్ను మినహాయింపు ఇస్తున్నామని, భారత్ లో జరిగే ఫిఫా అండర్-17 మహిళల వరల్డ్ కప్ నిర్వహణకు అవసరమయ్యే వస్తువులు, సేవలపై జీఎస్టీ మినహాయింపునివ్వాలని నిర్ణయించామని సీతారామన్ వివరించారు. గది రూ.1000 లోపు అద్దె ఉండే హోటళ్లకు పూర్తిగా పన్ను మినహాయింపు, రూ.1000 నుంచి రూ.7500 వరకు అద్దె ఉండే హోటళ్లకు జీఎస్టీ 12 శాతం, రూ.7500 పైబడి అద్దె ఉండే హోటళ్లకు 18 శాతం జీఎస్టీ విధిస్తున్నట్టు మంత్రి తెలిపారు. గోవాలో నేడు జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

  • Loading...

More Telugu News