Polavaram project: బెదిరించో, బతిమాలో తక్కువ ధరకే ఆ టెండర్ వేయించి ఉంటారు!: టీడీపీ నేత బాబూ రాజేంద్రప్రసాద్ ఆరోపణ
- చంద్రబాబుపై బురదజల్లేందుకు చూస్తున్నారు
- రివర్స్ టెండరింగ్ ప్రక్రియ అనుమానాస్పదంగా ఉంది
- వాస్తవాలన్నీ బయటకొస్తాయి
రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో భాగంగా పోలవరం ఎడమ కాల్వ అనుసంధానం, సొరంగం పనులను ఐబీఎం విలువ రూ.274.55 కోట్ల కన్నా తక్కువకు మ్యాక్స్ ఇన్ ఫ్రా సంస్థ కోట్ చేసిన విషయమై ఏపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ విమర్శలు, ఆరోపణలు చేశారు.
‘ఎన్టీవీ’లో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ నాటి పాలనపై, చంద్రబాబుపై బురదజల్లేందుకు వైసీపీ ప్రభుత్వం చూస్తోందని, అందుకే, సదరు కాంట్రాక్టరుని బెదిరించో, బతిమాలో లేక బాగా లాభం వచ్చే ఇంకో కాంట్రాక్టు ఇస్తామని చెప్పో ఐబీఎం విలువ కంటే తక్కువకు బిడ్ వేయించారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో దాదాపు రూ.290 కోట్లకు ఈ పనులను చేయలేని సంస్థ, అంతకన్నా తక్కువకు ఎలా చేస్తుంది? అని ప్రశ్నించారు. రివర్స్ టెండరింగ్ కు సంబంధించి జరిగిన ప్రక్రియ ఎంతో అనుమానాస్పదంగా ఉందని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే పోలవరం ప్రాజెక్టుపై వైసీపీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని, వాస్తవాలన్నీ మెల్లగా బయటకొస్తాయని అన్నారు.