polavaram projevt: రివర్స్ టెండరింగ్.. ‘పోలవరం’ 65వ ప్యాకేజీకి ఖరారైన టెండర్.. దక్కించుకున్న ‘మ్యాక్స్ ఇన్ ఫ్రా’!
- ఐబీఎం విలువ రూ.274.55 కోట్లు
- రూ.42.8 కోట్లు తక్కువకే కోట్ చేసిన ‘మ్యాక్స్ ఇన్ ఫ్రా’
- టెండర్ దక్కించుకోవడానికి పోటీపడ్డ ఆరు సంస్థలు
పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ కు సంబంధించి లెఫ్ట్ కనెక్ట్ విటీ పనుల్లో 65వ ప్యాకేజీకి టెండర్ ఖరారైంది. ఈ టెండర్ ను మ్యాక్స్ ఇన్ ఫ్రా సంస్థ దక్కించుకుంది. పోలవరం ఎడమ కాల్వ అనుసంధానం, సొరంగం పనుల్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియకు సంబంధించి టెక్నికల్ బిడ్లను జలవనరుల శాఖ అధికారులు తెరిచారు. ఐబీఎం (ఇనిషియల్ బెంచ్ మార్క్) విలువ రూ.274.55 కోట్లు. టెక్నికల్ బిడ్ విలువల ప్రకారం రూ.42.8 కోట్లు తక్కువకే ఈ సంస్థ కోట్ చేసింది. టీడీపీ హయాంలో 292.09 కోట్లకు మ్యాక్స్ ఇన్ ఫ్రా సంస్థ ప్రాజెక్టు పనులను దక్కించుకుంది. ఇప్పుడు 231.47 కోట్లకే ఈ సంస్థ టెండర్ దక్కించుకోవడం గమనార్హం.
ఈ సందర్భంగా ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, ఈరోజు నీటిపారుదల శాఖలో శుభపరిణామం జరిగిందని అన్నారు. రివర్స్ టెండరింగ్ వల్ల 15.6 శాతం తక్కువతో మ్యాక్స్ ఇన్ ఫ్రా సంస్థ కోట్ చేసిందని, ప్రభుత్వానికి రూ.50 కోట్లు ఆదా అవుతుందని చెప్పారు. ఈ నెల 23న పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి ఫైనాన్షియల్ బిడ్లను తెరుస్తామని తెలిపారు.
కాగా, ‘పోలవరం’ పనుల రివర్స్ టెండరింగ్ కి సంబంధించి ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ నుంచి ఎడమ కాల్వ అనుసంధాన పనులకు రూ.274.55 కోట్ల ఐబీఎం విలువతో వైసీపీ ప్రభుత్వం ఇటీవలే టెండర్లను ఆహ్వానించింది. టెండర్లు దక్కించుకోవడానికి మొత్తం ఆరు సంస్థలు పోటీపడ్డాయి. అందులో పటేల్ ఇంజనీరింగ్ లిమిటెడ్, మ్యాక్స్ ఇన్ ఫ్రా లిమిటెడ్, ఆఫ్కాన్స్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్, ఆర్ఆర్ సీఐఐపీఎల్-డబ్ల్యుసీపీఎల్, మేఘ ఇంజనీరింగ్ లిమిటెడ్, ఎంఆర్ కేఆర్ ఎస్ఎల్ ఆర్ సంస్థలు ఉన్నాయి.