RBI: భయపడాల్సిన పనిలేదు కానీ.. సంస్కరణలు అవసరమే: రిజర్వు బ్యాంకు గవర్నర్

  • మాంద్యం భయాలు అవసరం లేదు
  • మన జీడీపీలో విదేశీ రుణాలు 19.7 శాతమే
  • ఆర్థిక వ్యవస్థ నీరసంగా ఉంది

భారత ఆర్థిక వ్యవస్థ ఇంకా హుషారుగానే ఉందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంవైపు నడుస్తోందన్న భయాలు అవసరం లేదని భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ అభయమిచ్చారు. గురువారం ముంబైలో జరిగిన ఆర్థిక సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో విదేశీ రుణాలు 19.7 శాతం మాత్రమేనని, కాబట్టి ఈ విషయంలో ఆందోళన అవసరం లేదన్నారు. అంతర్జాతీయంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా, భారత ఆర్థిక వ్యవస్థపై మాత్రం ఆ ప్రభావం లేదన్నారు. అయితే,  అంతర్జాతీయ వాణిజ్యం క్షీణించడం మాత్రం కొంత ఆందోళన కలిగించే అంశమేనన్నారు.

అంతర్జాతీయంగా ఎదురవుతున్న కొన్ని సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత ఆర్థిక వ్యవస్థలో కొన్ని సంస్థాగత సంస్కరణలు తప్పనిసరి అని పేర్కొన్నారు. ఇక, సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై యెమన్ తిరుగుబాటుదారుల డ్రోన్ దాడుల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై ఉండబోదన్నారు.  సబ్సిడీల చెల్లింపు భారం తక్కువగా ఉండడం వల్ల ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు రెండూ పెద్దగా అదుపు తప్పే ప్రమాదం లేదని శక్తికాంతదాస్ అన్నారు. అయితే, నీరసించిన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహకాలు ప్రకటించడం కూడా కష్టమైనపనేనన్నారు. మరిన్ని అప్పులు తెచ్చి ప్రోత్సాహకాలు అందిస్తే ద్రవ్య లోటు అదుపు తప్పుతుందని ఆర్‌బీఐ గవర్నర్ హెచ్చరించారు.

  • Loading...

More Telugu News