Andhra Pradesh: ఇలాంటి పరిస్థితిని మేమెన్నడూ చూడలేదు.. గోదావరి సుడిగుండాలపై ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ ఆశ్చర్యం!
- దేవీపట్నం వద్ద ఐదో రోజు రెస్క్యూ ఆపరేషన్
- సుడిగుండాల్లో చిక్కుకుంటున్న గజఈతగాళ్లు
- ఇంకా దొరకని 13 మంది ఆచూకీ
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో పర్యాటకులతో వెళుతున్న పడవ మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ అధికారులు, గజఈతగాళ్ల సాయంతో 5వ రోజు కూడా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకూ 31 మంది ప్రయాణికుల మృతదేహాలను అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండర్ బీఎన్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. 68 మంది సభ్యులున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యల్లో పాల్గొంటోందని తెలిపారు. తొలుత రబ్బరు బోట్లతో మృతదేహాలను వెలికితీశామనీ, ప్రస్తుతం లాంచీని బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.
‘మా దగ్గరున్న సోనార్ సిస్టమ్ తో లాంచీ జాడ కనుగొనేందుకు ప్రయత్నించాం. అది సాధ్యపడకపోవడంతో ఉత్తరాఖండ్ నుంచి అత్యాధునిక సోనార్ వ్యవస్థను తెప్పించాం. ఈ సందర్భంగా మేం లాంచీని గుర్తించగలిగాం. కానీ ఇది 250 అడుగుల కంటే ఎక్కువ లోతులో మునిగిపోయి ఉంది. మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సుడిగుండాలు ఏర్పడుతున్నాయి. అక్కడకు బోట్లు వెళ్లడమే చాలా కష్టంగా ఉంది.
ఈ సుడిగుండాల్లో గజ ఈతగాళ్లు సైతం చిక్కుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితిని మేమెప్పుడూ చూడలేదు. నేవీ, స్థానిక యంత్రాంగం సాయంతో లాంచీకి లంగరు వేసి పైకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. ప్రమాదం జరిగిన చోట నది చాలా విశాలంగా ఉంది. కొద్దిదూరంలోనే మధ్యలో కొండ ఉండటంతో ఈ సుడిగుండాలు ఏర్పడుతున్నాయి. మా పడవను కూడా స్థిరంగా ఉంచడం కష్టంగా ఉంది. మిగిలిన 13 మంది జాడను త్వరలోనే కనుక్కుంటాం’ అని బీఎన్ సింగ్ పేర్కొన్నారు.