Andhra Pradesh: కోడెల చాలా ధైర్యవంతుడు.. ఆయన మరణంపై సమగ్ర దర్యాప్తు జరగాల్సిందే!: బీజేపీ నేత జీవీఎల్
- కోడెల మరణంపై రాజకీయాలు సరికాదు
- రాజధాని, హైకోర్టు నిర్మాణంపై తుది నిర్ణయం జగన్ దే
- ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు
తెలుగుదేశం నేత కోడెల శివప్రసాదరావు మరణంపై బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు స్పందించారు. కోడెల మరణంపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరముందని జీవీఎల్ వ్యాఖ్యానించారు. టీడీపీ నేత కోడెల చాలా ధైర్యవంతుడైన వ్యక్తి అనీ, ఆయన ఆత్మహత్య చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో ఈరోజు పర్యటించిన జీవీఎల్ మీడియాతో మాట్లాడారు. కోడెల మరణంపై రాజకీయాలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.
రాజధాని నిర్మాణం, ఏపీ హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది పూర్తిగా సీఎం జగన్ ఇష్టమేనని జీవీఎల్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోబోదని తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధికి ఒక్కో జిల్లాకు రూ.50 కోట్లు ఇచ్చిందని జీవీఎల్ గుర్తుచేశారు. ఈ నిధులను చంద్రబాబు ప్రభుత్వం పక్కదారి పట్టించిందనీ, లెక్కలు చెప్పాలని కేంద్రం కోరితే స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి పేరుతో చంద్రబాబు గ్రాఫిక్స్ సినిమా చూపించారనీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని దుయ్యబట్టారు. అమరావతిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని జీవీఎల్ నరసింహారావు తేల్చిచెప్పారు.