Odisha: బాలుడిని భుజాలపై మోసిన డాక్టర్.. ప్రశంసలు కురిపించిన ఒడిశా ముఖ్యమంత్రి పట్నాయక్!
- ఒడిశాలోని మల్కన్ గిరిలో ఘటన
- బాలుడు అనారోగ్యంతో ఉన్నట్లు సమాచారం
- డోలీలో మోసుకుని 5 కి.మీ ప్రయాణం
ఒడిశాలోని మల్కజ్ గిరి జిల్లాలో ఓ డాక్టర్ మానవత్వంతో వ్యవహరించాడు. మారుమూల ప్రాంతానికి అంబులెన్స్ రాలేకపోవడంతో రోగిని డోలీలో కట్టుకుని ఆసుపత్రికి తరలించాడు. ఇలా సదరు రోగిని 5 కిలోమీటర్ల దూరం మోసుకెళ్లాడు. ఈ ఘటన ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఖైరాపుట్ బ్లాక్ లో ఓ బాలుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు గ్రామస్తులు సమాచారం అందించారు. దీంతో 'ఆయుష్' వైద్యుడు డా.శక్తి ప్రసాద్ మిశ్రా అక్కడికి చేరుకున్నారు.
అయితే బాలుడి ఆరోగ్యం బాగా దెబ్బతినడంతో అతడిని ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించారు. కానీ రోడ్డు మార్గం సరిగ్గా లేకపోవడంతో దాదాపు 5 కిలోమీటర్ల మేర ఓ డోలీలో రోగిని మోసుకుని అంబులెన్సు ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ డాక్టర్ శక్తిప్రసాద్ మిశ్రాపై ప్రశంసలు కురిపించారు.
‘వైద్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ బాలుడిని డా. ప్రసాద్ తన భుజాలపై 5 కి.మీ మోసుకెళ్లారు. బాలుడిని కాపాడేందుకు ఆయన పడుతున్న తపన, నిబద్ధతను మనస్ఫూర్తిగా హర్షిస్తున్నా. ఓ రోగి జీవితాన్ని కాపాడేందుకు మానవత్వంతో వ్యవహరించిన డా.ప్రసాద్ ను అభినందిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.