Tamilnadu: 'జాతీయ భాషగా హిందీ' వివాదం.. బలవంతంగా రుద్దకూడదని రజనీకాంత్ హితవు!
- దక్షిణాది రాష్ట్రాలు హిందీని అంగీకరించవు
- ఉత్తరాదిలోనే ఏకాభిప్రాయం దొరకదు
- చెన్నైలో మీడియాతో సూపర్ స్టార్
భారత్ కు ఒకే జాతీయ భాష ఉండాలనీ, ఆ లోటును హిందీ భర్తీ చేయగలదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. షా వ్యాఖ్యలపై తమిళనాడు, కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాలు భగ్గుమన్నాయి. తమ గుర్తింపును, భాష, సంస్కృతి పరిరక్షణ కోసం ఎందాకైనా వెళతామని హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అభిమాని, సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ వివాదంపై స్పందించారు.
చెన్నైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏ భాషను కూడా బలవంతంగా రుద్దకూడదు. దక్షిణాది రాష్ట్రాలు దాన్ని అంగీకరించవు. అంతవరకూ ఎందుకు? ఉత్తరాదిలోనే ఒకే భాష విషయంలో ఏకాభిప్రాయం దొరకదు. దేశాభివృద్ధికి ఒకే భాష మంచిదే. కానీ దురదృష్టవశాత్తూ భారత్ లో అది సాధ్యపడదు’ అని కుండబద్దలు కొట్టారు. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ, హోంమంత్రి షాలను రజనీకాంత్ కృష్ణార్జునులుగా అభివర్ణించిన సంగతి తెలిసిందే.