Kodela: వైసీపీ నేతల వెకిలి కామెంట్లతో కోడెల మనసు గాయపడింది: కరణం బలరాం

  • కోడెలది వైసీపీ ప్రభుత్వం చేయించిన హత్యే
  • వినటానికి కూడా అసహ్యం వేసే చిల్లర కేసులు పెట్టారు
  • ఆత్మహత్యకు పాల్పడతారని ఊహించలేకపోయాం

ఏపీ మాజీ స్పీకర్ కోడెలది ముమ్మాటికీ వైసీపీ ప్రభుత్వం చేయించిన హత్యేనని టీడీపీ నేత కరణం బలరాం అన్నారు. అందుకే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను తాము ఒప్పుకోవడం లేదని... దీని వల్ల ప్రభుత్వానికి కనీసం బుద్ధైనా వస్తుందని చెప్పారు. ప్రభుత్వం మారగానే తన వద్ద ఉన్న ఫర్నిచర్ ను తీసుకెళ్లాలని కోడెల లేఖలు రాశారని... కానీ, ఫర్నిచర్ తీసుకెళ్లకుండా, ఆయనను వేధింపులకు గురి చేశారని మండిపడ్డారు.

వినటానికి కూడా అసహ్యం వేసే చిల్లర కేసులు పెట్టారని అన్నారు. వ్యక్తిగతంగా కోడెల ఎంతో బలవంతుడని... కానీ తన వ్యక్తిత్వాన్ని హత్య చేసే విధంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుండటంతో ఆయన ఎంతో క్షోభకు గురయ్యారని చెప్పారు. వైసీపీ నేతలు వెకిలిగా చేసిన కామెంట్లతో ఆయన మనసు చాలా బాధపడిందని అన్నారు.  

కోడెలను కలసి ధైర్యం చెప్పి రావాలని చంద్రబాబు చెబితే ఇటీవల తాము ఆయన వద్దకు వెళ్లి రెండున్నర గంటలసేపు మాట్లాడామని కరణం బలరాం తెలిపారు. ఎంతో ఉన్నతంగా బతికిన తనను అభాసుపాలు చేస్తున్నారని ఆ సందర్భంగా ఆయన బాధపడ్డారని చెప్పారు. ఆయన ఇలా ఆత్మహత్యకు పాల్పడతారని ఊహించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కోడెల మరణం టీడీపీకి తీరని లోటు అని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా మారాలని... వేధింపులను మానుకోవాలని సూచించారు.

Kodela
Karanam Balaram
Chandrababu
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News