Nalgonda: నల్గొండలో ఆకాశానికి చిల్లులు పడినట్టుగా కుండపోత వాన... వందేళ్ల రికార్డు బద్దలు
- ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు
- నల్గొండను ముంచెత్తిన వరుణుడు
- 6 గంటల వ్యవధిలో 200 మిమీ వర్షపాతం నమోదు
ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదవుతోంది. గత రెండ్రోజులుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో జోరుగా వానలు పడుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలోని నల్గొండ పట్టణంలో ఇటీవల కాలంలో కనీవినీ ఎరుగని రీతిలో కుంభవృష్టి చోటుచేసుకుంది. కేవలం ఆరు గంటల వ్యవధిలో 200 మిల్లీమీటర్ల వాన కురిసింది. 119 ఏళ్ల తర్వాత ఇంత తక్కువ వ్యవధిలో 20 సెమీ పైగా వర్షం పడడం ఇదే ప్రథమం.
అప్పట్లో ఇదే రీతిలో వర్షపాతం నమోదైనా ఎక్కువ సమయం తీసుకుంది. తాజాగా, మంగళవారం సాయంత్రం 5 గంటలకు మొదలైన వాన రాత్రి 11 గంటల వరకు ఏకధాటిగా కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడమే కాకుండా ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు.