Misbah Ul Haq: పాక్ క్రికెటర్ల నోరు కట్టేసిన కొత్త కోచ్!
- మికీ ఆర్థర్ స్థానంలో కోచ్ గా బాధ్యతలు అందుకున్న మిస్బావుల్ హక్
- బిర్యానీ, స్పైసీ ఫుడ్ కు నో చెప్పిన మిస్బా
- ఆటగాళ్లు 100 శాతం ఫిట్ నెస్ సాధించేందుకు కఠినచర్యలు
క్రికెట్ సహా ఏ క్రీడలోనైనా ఫిట్ నెస్ ఎంతో ముఖ్యం. అందుకే ఆయా జట్లకు ప్రత్యేకంగా ఫిట్ నెస్ ట్రయినర్లు ఉంటారు. వీరిపని ఆటగాళ్లతో కసరత్తులు చేయించడమే కాదు, వారేం తినాలో, ఏం తినకూడదో కూడా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. అయితే, పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు కోచ్ గా బాధ్యతలు స్వీకరించిన మాజీ ఆటగాడు మిస్బావుల్ హక్ ఈ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాడు. అందుకే పాక్ ఆటగాళ్లు ఇకపై బిర్యానీలు, మసాలా దట్టించిన వంటకాలు, మిఠాయిలు తినడం కుదరంటూ స్పష్టం చేశాడు.
క్రికెటర్లు 100 శాతం ఫిట్ నెస్ సాధించాలంటే ఇలాంటి కఠినచర్యలు తప్పవని మిస్బా అభిప్రాయపడుతున్నాడు. మ్యాచ్ లు లేని సమయంలో కూడా ఇదే డైట్ పాటించాల్సి ఉంటుందని మిస్బా పాక్ క్రికెటర్లను ఆదేశించాడు. ఈ కొత్త డైట్ ప్లాన్ పాకిస్థాన్ జట్టు ఆటగాళ్లకే కాకుండా జాతీయస్థాయి క్రికెటర్లందరికీ వర్తిస్తుందట. ప్రపంచకప్ లో వైఫల్యం కారణంగా మికీ ఆర్థర్ ను కోచ్ బాధ్యతల నుంచి తప్పించిన పాక్ క్రికెట్ బోర్డు మాజీ ఆటగాడు మిస్బాను కొత్త కోచ్ గా ప్రకటించింది.