Andhra Pradesh: మా కర్నూలులో ఏబీఎన్ ఛానల్ వస్తోంది.. ఆగిపోలేదు!: వైసీపీ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి
- నేడు హైదరాబాద్ కు చేరుకున్న కాటసాని
- టీడీపీ కారణంగానే కోడెల మరణం
- మేం ఆయనపై తప్పుడు కేసు పెట్టలేదు
ఏపీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి ఈరోజు తెలంగాణ మంత్రి కేటీఆర్ తో సమావేశమయ్యేందుకు హైదరాబాద్ కు చేరుకున్నారు. అనంతరం అసెంబ్లీకి వస్తుండగా మీడియా ఎదురుపడింది. ఈ సందర్భంగా రామ్ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. నమ్ముకున్న టీడీపీ కారణంగానే కోడెల చనిపోయారని విమర్శించారు. కొద్దిరోజులుగా పార్టీ సమావేశాలకు సైతం కోడెలను చంద్రబాబు పిలవలేదనీ, కనీసం నైతిక మద్దతు ఇవ్వలేదని దుయ్యబట్టారు. కోడెలపై ప్రభుత్వం ఫిర్యాదు చేయలేదనీ, స్థానిక టీడీపీ కార్యకర్తలే కోడెలపై కేసు పెట్టారని గుర్తుచేశారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ ను కాపీ కొట్టడం లేదనీ, వైఎస్సార్ అడుగుజాడల్లో మాత్రమే నడుస్తున్నారని స్పష్టం చేశారు. గోదావరి, కృష్ణా అనుసంధానం చేస్తే రెండు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఏపీలో ఏబీఎన్ ప్రసారాలు ఆగిపోలేదనీ, తమ కర్నూలు జిల్లాలో ఏబీఎన్ ఛానల్ వస్తోందని రాంభూపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర వల్ల రాయల తెలంగాణ ఆగిపోయిందని విమర్శించారు. ఇప్పటికీ అక్కడి ప్రజలకు తెలంగాణాలో కలవాలనే ఉందని పేర్కొన్నారు. ఏపీలో తమ ప్రభుత్వం ఎవ్వరిపైనా తప్పుడు కేసులు పెట్టదనీ, కానీ ఎవరైనా తప్పు చేస్తే మాత్రం వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.