Jagan: ఆగమేఘాల మీద కోడెలపై కేసులు పెట్టి, ఆయనను లైఫ్ లాంగ్ జైల్లో పెట్టాలని చూశారు: జగన్ పై చంద్రబాబు ఫైర్

  • అంతులేని అవినీతికి పాల్పడిన జగన్
  • కోడెల తీసుకెళ్లిన ఫర్నీచర్ విలువ రూ. 2 లక్షలు కూడా కాబోదు
  •  మనిషిలో పిరికితనాన్ని డెవలప్ చేశారు

తన తండ్రి అధికారంలో ఉన్న వేళ, అంతులేని అవినీతికి పాల్పడి, ప్రతి శుక్రవారమూ కోర్టు కేసులకు అటెండ్ అయ్యే జగన్, మచ్చలేని నేతగా ఉన్న కోడెలపై పదేపదే అసత్య ఆరోపణలతో బురద జల్లించి, ఆయన మనస్తాపానికి లోనయ్యేలా చేశారని మాజీ సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు.

ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, కోడెల తీసుకెళ్లిన ఫర్నీచర్ విలువ లక్షా, రెండు లక్షలు కూడా కాబోదని, అది పాత ఫర్నీచరని, అది తీసుకెళ్లారని, దానిపై ఆగమేఘాల మీద కేసులు పెట్టి, లైఫ్ లాంగ్ జైల్లో పెట్టాలని జగన్ చూశారని, అదే కోడెలకు తీవ్ర ఆవేదన కలిగించిందని అన్నారు. ఇప్పుడు జగన్, తాను ముఖ్యమంత్రిని అయ్యాను కాబట్టి, కోర్టు కేసులకు కూడా హాజరు కాబోనని అంటున్నారని విమర్శలు గుప్పించారు.

తన వద్ద ఉన్న ఫర్నీచర్ ను తీసుకెళ్లాలని కోడెల లెటర్ రాసిన తరువాత మాత్రమే, కేసులు నమోదు చేశారని, అది కూడా నరసరావుపేట ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుపై మాత్రమే నమోదయ్యాయని, ఏ అధికారీ పెట్టింది కాదని అన్నారు. ఇలా కేసులు పెట్టి, ఓ మనిషిలో పిరికితనాన్ని డెవలప్ చేశారని మండిపడ్డ చంద్రబాబు, చివరకు ఊహించలేని పరిణామం జరిగిందని అన్నారు.

పల్నాడు ప్రాంతాన్ని కోడెల ఎంతో అభివృద్ధి చేశారని, కోటప్పకొండను ఆయన తీర్చిదిద్దిన తీరు అద్భుతమని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. కేన్సర్ ఆసుపత్రిని ఆయన నిర్మించారని, అటువంటి వ్యక్తి లక్ష రూపాయల కోసం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారని అన్నారు. ఇప్పటికీ హైదరాబాద్ లో కోడెల అద్దె ఇంట్లోనే ఉంటున్నారని గుర్తు చేశారు. కేవలం రెండు నెలల వ్యవధిలో కోడెల కుటుంబీకులపై 19 కేసులను జగన్ పెట్టించారని అన్నారు.

  • Loading...

More Telugu News