RBI: ఈ ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగిన పొదుపు ఖాతాల జమ
- గణాంకాలు వెల్లడించిన రిజర్వు బ్యాంకు
- ఏకంగా రూ. 4 లక్షల కోట్ల మేర వృద్ధి
- రుణాల్లో కూడా భారీ పెరుగుదల
దేశంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో గత ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లు గణనీయంగా పెరిగినట్టు భారతీయ రిజర్వు బ్యాంకు తెలిపింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.4 లక్షల కోట్ల మేర పొదుపు జమలు పెరిగినట్టు ఆర్‌బీఐ పేర్కొంది. గత అర్థిక సంవత్సరంలో రూ.36.55 లక్షల కోట్ల సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లు ఉండగా, ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి 40.31 లక్షల కోట్లకు పెరిగినట్టు వివరించింది.
ఈ మొత్తం డిపాజిట్లలో రూ.39.72 లక్షల కోట్లు ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల్లోని డిపాజిట్లు కాగా, రూ.58,630 కోట్లు విదేశీ బ్యాంకుల్లో జమ అయినట్టు తెలిపింది. ఇక, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సగటు డిపాజిట్లు 6.7 శాతం, రుణాలు 8.7 శాతం పెరిగినట్టు తెలిపింది. అదే సమయంలో ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్లు 16.3 శాతం, రుణాలు 17.5 శాతం పెరిగినట్టు రిజర్వుబ్యాంకు గణాంకాలు వెల్లడించాయి.