Aramco: సౌదీలోని ఆరాంకో చమురు క్షేత్రాలపై మరిన్ని దాడులు: హౌతీ తిరుగుబాటుదారుల హెచ్చరిక
- ఆరాంకో చమురు క్షేత్రాలపై శనివారం డ్రోన్ దాడులు
- హౌతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ అండదండలు
- మరోమారు దాడులు జరిగే అవకాశం ఉందన్న అంతర్జాతీయ మీడియా
సౌదీ అరేబియాలోని ఆరాంకో చమురు క్షేత్రాలపై ఏ క్షణమైనా మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని, కాబట్టి విదేశీయులు వెంటనే ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాలని హౌతీ తిరుగుబాటుదారులు హెచ్చరించారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. సౌదీలోని అబ్‌కైక్, ఖురైస్ ప్రాంతంలో ఉన్న ఆరాంకో ఆయిల్ రిఫైనరీపై యెమన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు శనివారం డ్రోన్ దాడులకు పాల్పడ్డారు. దీంతో చమురు క్షేత్రాల్లో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి.
ప్రాణనష్టం జరగనప్పటికీ దాడి కారణంగా చమురు శుద్ధి నిలిచిపోయింది. కాగా, ఈ దాడుల వెనుక ఇరాన్ హస్తం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇరాన్-సౌదీ అరేబియా మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో హౌతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ సాయం చేస్తూ వస్తోంది. కాగా, ఆరాంకో చమురు క్షేత్రాలపై మరోమారు డ్రోన్ దాడులు జరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.