Jammu And Kashmir: కశ్మీర్ వెళ్లండి.. ప్రదర్శనలు మాత్రం వద్దు.. కాంగ్రెస్ నేత ఆజాద్‌కు సుప్రీం అనుమతి
- ఇటీవల శ్రీనగర్ విమానాశ్రయంలో ఆజాద్‌ని అడ్డుకున్న పోలీసులు
- కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం ఇవ్వాలంటూ సుప్రీంలో పిటిషన్
- జమ్ము, అనంతనాగ్, బారాముల్లా, శ్రీనగర్ జిల్లాల్లో పర్యటించేందుకు అనుమతి
కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కశ్మీర్ వెళ్లి తన కుటుంబ సభ్యులను కలిసేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే, జమ్ము, అనంతనాగ్, బారాముల్లా, శ్రీనగర్ జిల్లాలు వెళ్లేందుకు మాత్రమే అనుమతి లభించింది. పర్యటన సందర్భంగా ఎలాంటి రాజకీయ ప్రదర్శనలు నిర్వహించొద్దని ఆదేశించిన సుప్రీం.. అక్కడి ప్రజలతో మాట్లాడి పరిస్థితులు తెలుసుకోవచ్చని, ఈ విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. అయితే, ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా చూసుకోవాలని సూచించింది.
జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ వెళ్లి అక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు పలువురు నేతలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కశ్మీర్‌లో పర్యటించేందుకు ఇటీవల గులాం నబీ ఆజాద్ చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. శ్రీనగర్ విమానాశ్రయంలో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో తన కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశమైనా ఇవ్వాలంటూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన విజ్ఞప్తిని పరిశీలించిన సుప్రీం ధర్మాసనం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.