Prakasam Barrage: కృష్ణానదిలో స్నానానికి దిగిన అయ్యప్ప స్వాములు... ఒకరి గల్లంతు!
- మాల వేసుకున్న ఐదుగురు
- స్నానానికి నదిలోకి దిగి కొట్టుకుపోయిన వైనం
- నలుగురిని కాపాడిన మత్స్యకారులు
అయ్యప్ప మాల వేసుకున్న ఐదుగురు స్వాములు, గుంటూరు జిల్లా సీతానగరం పుష్కరఘాట్ దగ్గర కృష్ణానదిలో స్నానానికి దిగి కొట్టుకుపోతుండగా, చూసిన మత్స్యకారులు నలుగురిని రక్షించారు. మరొకరు గల్లంతు కాగా, అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన నిన్న జరిగింది.
మరిన్ని వివరాల్లోకి వెళితే, విజయవాడ మధురానగర్ కు చెందిన ధర్మ ముఖేష్, అతని సోదరుడు నాగకల్యాణ్, వారి బంధువులైన పిచ్చేశ్వరరావు, హేమంత్ కుమార్, నాగరాజు అయ్యప్ప మాల ధరించారు. వీరంతా కలిసి ఆదివారం నాడు అమరావతికి వెళ్లి, సాయంత్రం 4.30 గంటల సమయంలో కృష్ణా నదిలో స్నానం చేసి, పూజ ముగించుకోవాలని భావించారు.
ఘాట్ కు, పుష్కర కాలువకు మధ్య వున్న ఐరన్ పైపులు పట్టుకుని స్నానం చేస్తున్న వేళ, తొలుత నాగకల్యాణ్ నీటిలోకి జారిపోయాడు. అతన్ని కాపాడే క్రమంలో మిగతా నలుగురూ కూడా నదిలోకి దిగారు. వీరిని గమనించిన మత్స్యకారులు, ముఖేశ్ మినహా మిగతా నలుగురినీ కాపాడారు. ఆచూకీ లభించకుండా పోయిన, ముఖేశ్ కోసం అధికారులు గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు. ఈ ఘటనతో ముఖేశ్ కుటుంబంలో విషాదం అలముకుంది.