Narendra Modi: అదే జరిగితే చారిత్రాత్మకం, అపూర్వం: 'హోడీ మోడీ' సభపై భారత అంబాసిడర్ హర్ష వర్ధన్!
- 22న హ్యూస్టన్ లో మోదీ సభ
- హాజరుకానున్న పలువురు అమెరికన్ ప్రజా ప్రతినిధులు
- ట్రంప్ హాజరవుతారన్న వైట్ హౌస్
ఈ నెల 22న హ్యూస్టన్ లోని భారీ స్టేడియంలో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి, నరేంద్ర మోదీ 'హౌడీ మోడీ' (హౌ డూ యూ డూ మోడీ) కార్యక్రమంలో ప్రసంగించనుండగా, ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఇప్పటికే 50 వేల మందికిపైగా రిజిస్టర్ చేయించుకున్నారు. ఇక, ఈ కార్యక్రమానికి పలువురు యూఎస్ ప్రజా ప్రతినిధులతో పాటు, ట్రంప్ కూడా హాజరవుతారని ఫారిన్ మీడియా అంటున్న వేళ, అదే జరిగితే, ఈ ఘటన ఓ అద్భుతమవుతుందని, చరిత్రలో నిలిచిపోతుందని యూఎస్ లో భారత అంబాసిడర్ హర్ష వర్థన్ ష్రింగ్లా అభివర్ణించారు.
ఇద్దరు నేతలూ ఈ వేదికపై కలిస్తే మాత్రం అది చారిత్రాత్మకమేనని, అమెరికా అభివృద్ధిలో భారత్ పాత్రను అంగీకరించినట్టేనని అన్నారు. రెండు దేశాల మధ్యా, ముఖ్యంగా మోదీ, ట్రంప్ ల మధ్య స్నేహ బంధం మరింతగా పెరుగుతుందని ష్రింగ్లా అభిప్రాయపడ్డారు. కాగా, 22న జరిగే కార్యక్రమానికి ట్రంప్ హాజరవుతారని వైట్ హౌస్ ఓ ప్రకటనలో తాజాగా వెల్లడించింది. దీంతో ఈ సంవత్సరం ట్రంప్, మోదీల మధ్య జరిగే మూడో సమావేశానికి వేదికగా హ్యూస్టన్ నిలువనుంది.
గత నెల 26న జీ7 దేశాల సదస్సుకు ప్రత్యేక ఆహ్వానాన్ని అందుకున్న మోదీ, ఫ్రాన్స్ కు వెళ్లగా, అక్కడ ట్రంప్ తో సమావేశమయ్యే అవకాశం లభించింది. ఇక హ్యూస్టన్ మీటింగ్ కు తొలి ఇండో అమెరికన్ హిందూ కాంగ్రెస్ మెన్ తులసీ గబ్బార్డ్, ఇండియన్ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి సహా 60 మంది వరకూ ప్రజా ప్రతినిధులు హాజరవుతారని అంచనా. హ్యూస్టన్ టెక్సాన్స్ ఫుట్ బాల్ టీమ్ వాడుకునే ఎన్ఆర్జీ స్టేడియం మోదీ సభకు వేదిక కానుంది.