Jagan: నాడు దేవీపట్నం లాంచీ ప్రమాదంపై జగన్ ట్వీట్... వైరల్ చేస్తూ, ఇప్పుడేమంటారని నెటిజన్ల ప్రశ్న!
- ప్రభుత్వ అవినీతితోనే ప్రమాదాలు
- గతంలో జగన్ వ్యాఖ్యలు వైరల్
- ఇప్పుడూ ప్రభుత్వ అవినీతే అంటున్న నెటిజన్లు
గోదావరిలో నిన్న ఘోర దుర్ఘటన జరిగి, 12 మంది మృతి చెందగా, మరో 25 మందికి పైగా గల్లంతైన నేపథ్యంలో, ఏపీ సీఎం వైఎస్ జగన్ గతంలో చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు మరోసారి వైరల్ అయింది. ప్రభుత్వ నిర్లక్ష్యం, అవినీతి వల్లే ఘోరాలు జరుగుతున్నాయంటూ, దేవీపట్నం లాంచీ ప్రమాదంపై జగన్ ట్వీట్ చేయగా, అప్పట్లో దాన్ని 'సాక్షి' పత్రిక ప్రచురించింది.
ఇప్పుడా క్లిప్పింగ్ మరోసారి వైరల్ కాగా, సీఎం హోదాలో ఉన్న జగన్, ఏమంటారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నాడు ప్రభుత్వ అవినీతి, నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పిన ఆయన, ఇప్పుడు కూడా అదే విషయాన్ని అంగీకరిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. ఆదివారం నాడు ప్రమాదం జరిగిన లాంచ్ ప్రయాణానికి అనుమతి లేదని స్వయంగా హోమ్ మంత్రి మేకతోటి సుచరిత ప్రకటించడంతో, అసలు ఈ బోటు అనుమతి లేకుండా ఎలా బయలుదేరిందని అడుగుతున్నారు. అధికారులు లంచాలు తీసుకుంటున్నారని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.