India: సరిహద్దులో పాక్ కాల్పులు.. ప్రాణాలకు తెగించి 20 మంది పిల్లల్ని కాపాడిన భారత ఆర్మీ!
- ఎల్వోసీ వెంట పూంఛ్ సెక్టార్ లో ఘటన
- భారత ఆర్మీ పోస్టుల, గ్రామాలపై పాక్ కాల్పులు
- స్కూలులో చిక్కుకున్న 20 మంది చిన్నారులు
జమ్మూకశ్మీర్ కు సంబంధించి ఆర్టికల్ 370ని కేంద్రం రద్దుచేసిన వేళ పాకిస్థాన్ పగతో రగిలిపోతోంది. ఓవైపు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ, మరోవైపు ఉగ్రవాదులను భారత్ లోకి ఎగదోస్తూ తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో నిన్న పాక్ కాల్పుల విరమణ సందర్భంగా జరిగిన ఆసక్తికరమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నియంత్రణ రేఖ(ఎల్వోసీ) పరిధిలోని పూంఛ్ సెక్టార్ లో భారత ఆర్మీ స్థావరాలు, గ్రామాలు లక్ష్యంగా పాక్ కాల్పులు జరిపింది. మోర్టార్ షెల్స్, తేలికపాటి ఆయుధాలతో భారత పోస్టులపై బుల్లెట్ల వర్షం కురిపించింది. ఈ సందర్భంగా పూంఛ్ పరిధిలోని స్థానిక పాఠశాలలో 20 మంది విద్యార్థులు చిక్కుకుపోయారు. వారంతా ప్రాణభయంతో వణికిపోగా, భారత ఆర్మీ వెంటనే రంగంలోకి దిగింది.
తమ ప్రాణాలను లెక్కచేయకుండా చిన్నారులను మైన్ ప్రూఫ్ వాహనంలోకి ఎక్కించింది. భారత బలగాల ఎదురుదాడితో పాక్ కొద్దిసేపటికే తోక ముడిచింది. దీంతో పిల్లలను ఆర్మీ వారి ఇళ్ల వద్ద సురక్షితంగా విడిచిపెట్టింది. ఈ ఘటనకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.