Srisailam: శ్రీశైలానికి భారీగా తగ్గుతున్న వరద!
- మూసుకుపోయిన ఆల్మట్టి గేట్లు
- కర్ణాటకలో ఆగిన వర్షాలు
- నాలుగు గేట్లను మాత్రమే తెరచివుంచిన అధికారులు
కర్ణాటకలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఆల్మట్టి గేట్లు మళ్లీ మూసుకుపోయాయి. దీంతో శ్రీశైలానికి వస్తున్న వరద నీరు తగ్గిపోయింది. దీంతో నిన్నటివరకూ 10 గేట్లను తెరచి దిగువకు నీటిని వదులుతున్న అధికారులు, ఆరు గేట్లను మూసివేశారు. ప్రస్తుతం 4 గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి, 2,17,283 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయానికి ఇన్ ఫ్లో 2 ,17,284 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు.
జలాశయానికి 215 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం ఉండగా, 214.3637 టీఎంసీల నీరుందని, 885 అడుగుల నీటిమట్టానికి గాను, 884.80 అడుగుల నీరుందని తెలిపారు. రెండు జలవిద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నామన్నారు. కాగా, వస్తున్న వరద నీటిని బట్టి నాగార్జున సాగర్ గేట్లను మూసివేయడంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.