Police: ఇప్పుడే జరిమానాలు వేయరు... హైదరాబాద్ పోలీసులు చేస్తున్నదిదే!

  • హెల్మెట్ ను కొనిపిస్తున్న పోలీసులు
  • లైసెన్స్ లేకుంటే వెంటనే స్లాట్ బుకింగ్
  • పొల్యూషన్, బీమా కూడా అక్కడికక్కడే

మితిమీరిన వేగం, లైసెన్స్ లేకుండా వాహనం నడిపించడం, హెల్మెట్ ధరించక పోవడం వంటి ఉల్లంఘనలకు వేలకొద్దీ జరిమానాలను ఇప్పటికిప్పుడు అమలు చేయకుండా, కొంతకాలం ప్రజలకు అవగాహన కల్పించే పనులు చేపట్టాలని హైదరాబాద్ పోలీసులు నిర్ణయించారు.

అందులో భాగంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసులు తీసుకుంటున్న చర్యలు, మిగతా కమిషనరేట్ లకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. వాహనాలను తనిఖీలు చేస్తున్న వేళ, హెల్మెట్ లేకపోతే, కొత్త నిబంధనలు, జరిమానాల గురించి చెప్పి, అప్పటికప్పుడు హెల్మెట్ కొనేలా చూస్తున్నారు పోలీసులు. ఇక లైసెన్స్ లేకుంటే, వెంటనే ఎల్ఎల్ఆర్ స్లాట్ బుక్ చేస్తున్నారు. ఆ సమయానికి వారు తప్పనిసరిగా వెళ్లి లెర్నింగ్ లైసెన్స్ తీసుకుని, దాని కాపీని సంబంధిత అధికారికి చూపించి, జరిమానాను రద్దు చేయించుకోవచ్చు.

ఇక ఇన్స్యూరెన్స్ లేకున్నా, పొల్యూషన్ సర్టిఫికెట్ లేకున్నా, అక్కడికక్కడే వాటిని కొనిపిస్తున్నారు. పొల్యూషన్ చెక్ చేసేందుకు వాహనాన్ని పక్కనే సిద్ధంగా ఉంచుతున్నారు. భారీ జరిమానాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలోనే, పట్టుబడిన వాహనానికి ఏమైతే కాగితాలు లేవో, అవన్నీ తీసుకునేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని భావించి, ఇలా చేస్తున్నట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇక రాచకొండ పోలీసులు ప్రారంభించిన ఈ డ్రైవ్ ను సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనూ అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News