Chandrababu: 'వెలివేయడం' అనే అనాగరిక చర్యను ఓ చిన్నారి ఎదుర్కోవాల్సి రావడం సిగ్గుచేటు: చంద్రబాబు

  • సీఎం జగన్ కు లేఖ రాసిన ప్రకాశం జిల్లా చిన్నారి
  • తన తండ్రి, తాతలకు ప్రాణాపాయం ఉందంటూ లేఖలో వెల్లడి
  • తనకు మధ్యాహ్న భోజనం పెడతారో లేదోనంటూ సందేహం

మమ్మల్ని వెలివేశారు అంటూ ఎనిమిదేళ్ల చిన్నారి సీఎం జగన్ కు లేఖ రాయడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ప్రకాశం జిల్లా రామచంద్రాపురానికి చెందిన పుష్ప అనే ఆ బాలిక తన తండ్రి, తాతలను చంపేస్తామని బెదిరిస్తున్నారని, తమను వెలివేశారని లేఖలో పేర్కొంది. స్వదస్తూరీతో ఆ చిన్నారి రాసిన లేఖ అనేకమందిని కదిలించింది. కనీసం తనకు స్కూల్లో భోజనం పెడతారో లేదో అంటూ దీనంగా అడగడం అందరినీ చలించిపోయేలా చేసింది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రంగా స్పందించారు.

కల్లాకపటం తెలియని పసివయసులో ఒక చిన్నారి వెలివేయడం అనే అనాగరిక చర్యను ఎదుర్కోవాల్సి రావడం సభ్య సమాజానికి సిగ్గుచేటు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లా చిన్నారి పుష్ప విన్నపాన్ని ప్రభుత్వం సీరియస్ గా పరిగణించాలని డిమాండ్ చేశారు. తన సొంతూళ్లో పరిస్థితులను లేఖ ద్వారా వెల్లడించిన పుష్ప ధైర్యాన్ని అభినందించకుండా ఉండలేకపోతున్నానని చంద్రబాబు ట్విట్టర్ లో పేర్కొన్నారు. తన కుటుంబీకులకు ప్రాణాపాయం ఉందన్న భయాన్ని ఆ పాప నుంచి తొలగించాలని, స్వేచ్ఛగా చదువుకునే వాతావరణం కల్పించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News