Pakistan: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు పీవోకేలో చేదు అనుభవం
- ఆర్టికల్ 370 రద్దుతో ఉడికిపోతున్న పాక్
- పీవోకేలో ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన ఇమ్రాన్
- వెనక్కి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేసిన స్థానికులు
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)ను కైవసం చేసుకుంటామంటూ బీజేపీ నేతలు ప్రకటనలు గుప్పిస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుతో కుతకుతలాడిపోతున్న పాక్ అధినాయకత్వం పీవోకే ప్రజల సానుభూతి పొందాలని కోరుకుంది. ఈ క్రమంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పీవోకేలోని ముజఫరాబాద్ పట్టణానికి వచ్చారు. అయితే, తనకు ఘనస్వాగతం లభిస్తుందని ఆశించిన ఇమ్రాన్ కు మతిపోయినంత పనైంది. అక్కడి ప్రజలు "గో బ్యాక్ నాజీ" అంటూ నినదించడమే కాకుండా, 'కశ్మీర్ హిందుస్థాన్ సొంతం' అంటూ ప్లకార్డులతో ఎదురొచ్చారు.
ఇలాంటి పరిణామం ఇమ్రాన్ ఖాన్ ఏమాత్రం ఊహించనిది. కొన్నాళ్లుగా పీవోకే ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. దీని పర్యవసానమే ఇమ్రాన్ కు చేదు అనుభవం రూపంలో ఎదురైంది. వాస్తవానికి ఆయన ఇక్కడ 'బిగ్ జల్సా' పేరిట నిర్వహించే భారీ ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చారు. కానీ స్థానికుల ఆగ్రహావేశాలను చవిచూడాల్సి వచ్చింది.