Kamalathal: తమిళనాడు 'ఇడ్లీ బామ్మ'కు గ్యాస్ కనెక్షన్ మంజూరు చేసిన ప్రభుత్వం
- రూపాయికే ఇడ్లీ అమ్ముతున్న కమలత్తాళ్
- కట్టెల పొయ్యిపై వంటతో కష్టాలు
- స్పందించిన ప్రభుత్వం
రూపాయికే ఇడ్లీ అమ్ముతూ పేదల ఆకలి తీర్చుతున్న తమిళనాడు ఇడ్లీ బామ్మ కమలత్తాళ్ కు ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్ మంజూరు చేసింది. వృద్ధురాలైన కమలత్తాళ్ కట్టెల పొయ్యిపై ఎంతో కష్టపడి వంట చేస్తుండడం సాధారణ నెటిజన్లనే కాదు ఆనంద్ మహీంద్రా వంటి వ్యాపార దిగ్గజాన్ని కూడా కదిలించింది. తాను ఆమెకు ప్రతినెలా గ్యాస్ సిలిండర్ కు అయ్యే ఖర్చు భరిస్తానని ఆయన ముందుకు వచ్చారు. తాజాగా, ఇడ్లీ బామ్మ కథనం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం స్పందించింది. ఆమెకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ మంజూరు చేసింది. దాంతో ఆమెకు కాస్త ఊరట కలిగినట్టేనని నెటిజన్లు భావిస్తున్నారు.
కమలత్తాళ్ వయసు 82 సంవత్సరాలు. కోయంబత్తూరు సమీపంలోని వడివేలంపాళ్యం గ్రామంలో ఇడ్లీ బామ్మ అంటే ఎవరైనా చెప్పేస్తారు. కేవలం రూపాయికే ఇడ్లీ అమ్మడం ద్వారా ఆమె పేదల పాలిట పెద్దమ్మగా పేరు తెచ్చుకుంది.