Imrankhan: దౌత్యపరంగా ఓడిపోయాం...ప్రపంచం మా వెనుక నిలబడలేదు: అంగీకరించిన ఇమ్రాన్‌ఖాన్
- కశ్మీర్ విషయంలో మా మాట ఎవరూ విశ్వసించలేదు
- ఈ విషయంలో మిత్రదేశాలు తీవ్రంగా స్పందిస్తాయనుకున్నా
- ఓ విదేశీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్ ప్రధాని నైరాశ్యం
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఇప్పటికి తత్వం బోధపడినట్లు ఉంది. కశ్మీర్ విషయంలో ప్రగల్భాలు పలికిన ఆయన ప్రస్తుతం నిరాశతో మాట్లాడుతున్నారు. ఈ విషయంలో దౌత్యపరంగా ఓడిపోయామని, తమ వెనుక నిలబడేందుకు ఒక్క దేశం కూడా ఆసక్తి చూపించలేదని వాపోయారు. రష్యాకు చెందిన ఓ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఇమ్రాన్‌ఖాన్ ఇంతటి నైరాశ్యంలోనూ భారత్‌పై విషం కక్కడం మానలేదు. ఇదంతా భారత్ గొప్పతనం ఏమీ కాదని, కేవలం ఆ దేశంతో ప్రపంచదేశాలకు ఉన్న వాణిజ్య సంబంధాల వల్లే ఇలా జరిగిందని చెప్పుకొచ్చారు.
'కశ్మీర్‌ను భారతదేశం తన భూభాగంలో కలిపేసుకుంటే ప్రపంచ దేశాలు తీవ్రంగా స్పందిస్తాయనుకున్నాం. కానీ అదేం జరగలేదు. మావైపు నిలబడడానికి ఒక్క దేశం కూడా ఆసక్తి చూపించలేదు. దీనికి వాణిజ్య అంశాలే కారణం’ అన్నారు. అంతర్జాతీయ సమాజం మద్దతు కూడగట్టడంలో తాము విఫలమయ్యామని అంగీకరించారు.
పాక్‌కు అండగా నిలిచేందుకు ఒక్క దేశమూ ముందుకు రాలేదని అంగీకరించారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న 370 ఆర్టికల్‌ను రద్దుచేస్తూ భారత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి పాక్ రగిలిపోతున్న విషయం తెలిసిందే. అణు యుద్ధం చేస్తామంటూ బీరాలు పలికి, పరోక్షంగా బెదిరించాలని చూసింది. ఆ పప్పులేమీ ఉడకకపోవడంతో ఇప్పుడు ప్రపంచాన్ని నిందిస్తోంది.