Andhra Pradesh: తప్పుడు అఫిడవిట్ కేసు.. టీడీపీ నేత కరణం బలరాంకు ఏపీ హైకోర్టు నోటీసులు!
- ఏపీ హైకోర్టులో వైసీపీ నేత ఆమంచి పిటిషన్
- ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నా చెప్పలేదని వ్యాఖ్య
- కరణం, రిటర్నింగ్ అధికారికి హైకోర్టు నోటీసులు
తెలుగుదేశం నేత, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీచేసింది. కరణం బలరాం తన ఎన్నికల అఫిడవిట్ లో పలు అంశాలను దాచిపెట్టారనీ, తప్పుడు అఫిడవిట్ ను సమర్పించారని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కొన్నిరోజుల క్రితం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తన నామినేషన్‌లో భార్య పేరును కరణం సరస్వతిగా బలరాం పేర్కొన్నారని, అయితే ఆయనకున్న మరో భార్య ప్రసూన, కుమార్తె గురించి నామినేషన్‌లో ప్రస్తావించలేదని కోర్టుకు విన్నవించారు.
కాబట్టి ఆయన ఎన్నికను రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్ ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవి.. కరణం బలరాంతో పాటు అప్పటి చీరాల ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నోటీసులు జారీచేశారు. ఈ కేసులో 3 వారాల్లోగా స్పందనను తెలియజేయాలని ఆదేశించారు. అనంతరం విచారణను 3 వారాలకు వాయిదా వేశారు.