Pawan Kalyan: ప్రజలను ఆందోళనకు గురి చేసేలా జగన్ 100 రోజుల పాలన: పవన్ కల్యాణ్ విమర్శలు
- వైసీపీ పాలన ప్రణాళికాబద్ధంగా లేదు
- దార్శనికత, పారదర్శకత లోపించింది
- రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు
వైసీపీ 100 రోజుల పాలనపై జనసేన నేడు నివేదికను విడుదల చేసింది. 9 అంశాలతో కూడిన 33 పేజీల నివేదికను జనసేనాని పవన్ కల్యాణ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, వైసీపీ 100 రోజుల పాలన ప్రణాళికాబద్ధంగా లేదని విమర్శించారు. పాలనలో దార్శనికత, పారదర్శకత లోపించిందని అన్నారు. ఎన్నికల్లో 150కి పైగా సీట్లను గెలుచుకున్న వైసీపీ పాలనపై కనీసం ఒక సంవత్సరం వరకు తాము మాట్లాడాల్సిన అవసరం ఉండదని అనుకున్నామని... కానీ, మూడు వారాల్లోపే వారు తీసుకున్న ఆందోళనకర నిర్ణయాలు ప్రజలు ఆక్షేపించేలా ఉన్నాయని విమర్శించారు.
ప్రజలను ఆందోళనకు గురి చేసేలా, రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని పవన్ అన్నారు. తాను చౌకబారు విమర్శలు చేయనని... అన్ని విషయాలను లోతుగా అధ్యయనం చేసిన తర్వాతే మాట్లాడతానని చెప్పారు. వైసీపీ మేనిఫెస్టోలోని నవరత్నాలు జనరంజకమైనవని... కానీ, వారి పాలన మాత్రం జన విరుద్ధమైనదని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగడం లేదని విమర్శించారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత తాము మరింత బలపడ్డామని... ఎందుకంటే సమాజం కోసం పోరాడాలనే తపన తమలో ఉందని చెప్పారు.