Madhya Pradesh: పనిచేసి పెట్టేందుకు రూ.25 వేలు అడిగిన తహసీల్దార్.. దున్నపోతును ఇచ్చిన బాధితుడు!
- మధ్యప్రదేశ్‌లో బయటపడిన తహసీల్దార్ అవినీతి బాగోతం
- దున్నపోతును తెచ్చి తహసీల్దార్ కారుకు కట్టిన వ్యక్తి
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో
పనిచేసి పెట్టేందుకు లంచం అడిగిన తహసీల్దార్‌కు దున్నపోతును ఇచ్చి పనిచేయమని వేడుకున్నాడో వ్యక్తి. మధ్యప్రదేశ్, విదిశాలోని సిరోజ్‌లో జరిగిందీ ఘటన. గ్రామానికి చెందిన భూపతి సింగ్ భూమికి సంబంధించిన విషయమై నెలల తరబడి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగాడు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో తహసీల్దార్ సిద్ధార్థ సింగ్లాను కలిసి పనిచేసి పెట్టమని ప్రాధేయపడ్డాడు.
అయితే, రూ.25 వేలు సమర్పించుకుంటే పనిచేసి పెడతానని తహసీల్దార్ ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పేశాడు. దీంతో అంతసొమ్ము సమర్పించుకోలేని భూపతి సింగ్ తన వద్ద ఉన్న దున్నపోతును తీసుకొచ్చి తహసీల్దార్ కారుకు కట్టేశాడు. దానిని తీసుకుని తన పనిచేసి పెట్టాలని వేడుకున్నాడు. దీంతో తహసీల్దార్ అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. వాహనానికి కట్టిన దున్నపోతు ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.