Azam Khan: ఎంపీ అజం ఖాన్ పై మరో కేసు... మేకలు దొంగిలించారంటూ మహిళ ఫిర్యాదు
- వివాదాస్పద నేతగా పేరొందిన అజం ఖాన్
- ఇప్పటివరకు 82 కేసులు నమోదు
- వాటిలో భూఆక్రమణ కేసులే అత్యధికం
ఉత్తరప్రదేశ్ సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, ఎంపీ అజం ఖాన్ ను కేసుల తలనొప్పి వీడడం లేదు. గేదెలు దొంగిలించారని, పుస్తకాలు ఎత్తుకెళ్లారని ఆయనపై ఎన్నో కేసులున్నాయి. ఇప్పటివరరకు ఆయనపై 82 కేసులు నమోదు కాగా, అత్యధికం భూ ఆక్రమణలకు సంబంధించినవే. అయితే కొన్ని విచిత్రమైన కేసులు కూడా అజం ఖాన్ మెడకు చుట్టుకున్నాయి. తాజాగా, ఆయనపై మేకలు దొంగిలించారంటూ ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనికి సంబంధించిన ఫిర్యాదు 2016 నాటిది కాగా, ఇన్నాళ్లకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
యతీంఖాన్ సరాయ్ గేట్ ప్రాంతానికి చెందిన నసీమా ఖాతూన్ (50) అనే మహిళ అప్పట్లో అజం ఖాన్ పై ఫిర్యాదు చేశారు. అజం ఖాన్ తన అనుచరులతో కలిసి తన నివాసంపై దాడి చేశారని, బంగారంతో పాటు, గేదెలు, ఆవు, నాలుగు మేకలను ఎత్తుకెళ్లారని నసీమా ఆరోపించారు. వక్ఫ్ బోర్డుకు చెందిన భూమిలో తాను కూడా కౌలుదారునని, రెండు దశాబ్దాలుగా తాను కౌలుదారునని ఆమె వివరించారు. అయితే, ఆ భూమి నుంచి తాము వెళ్లిపోవాలని అజం ఖాన్ బెదిరిస్తున్నాడని, ఓ స్కూల్ కోసం ఆ భూమిని లాక్కోవాలని ప్రయత్నిస్తున్నాడని నసీమా వెల్లడించారు.