SHAR: ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో షార్ వద్ద హై అలర్ట్
- సముద్ర మార్గం గుండా ఉగ్రవాదులు చొరబడే అవకాశం
- గస్తీని ముమ్మరం చేసిన మెరైన్ పోలీస్, సీఐఎస్ఎఫ్
- శ్రీహరికోట అడవుల్లో కూంబింగ్
జమ్ముకశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత పాకిస్థాన్ రగిలిపోతోంది. ఏదో విధంగా భారత్ లో అలజడి సృష్టించేందుకు కుట్రలకు పాల్పడుతోంది. సరిహద్దుల్లో కాల్పులకు తెగబడటం ద్వారా ఉద్రిక్తతలను పెంచుతోంది. ఇదే సమయంలో, భారత భూభాగంలో విధ్వంసాలకు పాల్పడేందుకు ఉగ్రవాదులను చొప్పించేందుకు శత విధాలా ప్రయత్నిస్తోంది.
ఈ నేపథ్యంలో, కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల హెచ్చరికతో శ్రీహరికోటలోని షార్ కేంద్రం వద్ద హై అలర్ట్ ప్రకటించారు. సముద్ర మార్గం గుండా ఉగ్రవాదులు చొరబడవచ్చనే హెచ్చరికలతో భద్రతను ముమ్మరం చేశారు. బంగాళాఖాతంలో 50 కిలోమీటర్ల మేర మెరైన్ పోలీసులు, సీఐఎస్ఎఫ్ బలగాలు గస్తీని ముమ్మరం చేశాయి. శ్రీహరికోట ప్రాంతంలోని అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. వేనాడు దర్గాకు వచ్చే వాహనాలను నిశితంగా తనిఖీ చేస్తున్నారు.