Nellore: వామ్మో! నెల్లూరు కి'లేడీ'... పోలీసులకే ముచ్చెమటలు!
- హాస్టళ్లలో ఉంటూ చోరీలు
- గతంలో జైలుకు వెళ్లి వచ్చినా మారని తీరు
- గాలిస్తున్న పోలీసులు
మహిళల హాస్టళ్లలో చేరి, పక్కనున్నవారి బంగారు ఆభరణాలను, సెల్ ఫోన్లను, వీలైతే వారి ఏటీఎం కార్డులు, పిన్ నంబర్లను చోరీ చేస్తున్న ఓ యువతిని అరెస్ట్ చేసేందుకు ఇప్పుడు పోలీసులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఓ మారు జైలుకు వెళ్లి వచ్చినా, తీరు మార్చుకోకుండా, తనదైన శైలిలో దొంగతనాలు చేస్తున్న ఈ కి'లేడీ' కోసం పోలీసులు తెగ వెతుకుతున్నారు. వివరాల్లోకి వెళితే...
నెల్లూరు జిల్లా వింజమూరుకు చెందిన ఓ యువతి, భర్త నుంచి దూరంగా ఉంటూ, 2013లో ఓ దొంగతనం కేసులో జైలుకు వెళ్లగా, పోలీసులు సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేశారు. దాంతో నెల్లూరుకు మకాం మార్చిన ఆమె, తన చాకచక్యంతో ఏదో ఓ కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తూ, దాని చూపి, లేడీస్ హాస్టళ్లలో ఆశ్రయం పొందేది. రూమ్ లోని సహ ఉద్యోగినులు నిద్రిస్తున్న వేళ, నగలు, డబ్బు, సెల్ ఫోన్లు కొట్టేసి ఉడాయించేది. ఆపై మరో ఉద్యోగం చూసుకుని ఇదే తంతు. ఇటీవల బాలాజీ నగర్ పీఎస్ పరిధిలో ఓ బ్యాంకు ఉద్యోగిని ఫోన్, ఏటీఎం కార్డు, నగదు పోయినట్టు ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఈ మహిళ కోసం గాలింపు ముమ్మరం చేశారు.
ఈ సంవత్సరం జూలై 21న వీఆర్సీ సెంటర్ లోని ఓ హాస్టల్ లో యువతి నిద్రిస్తుండగా, ఆమె గొలుసు, సెల్ ఫోన్ ను దొంగతనం చేసి వెళ్లిన ఈమెపై, కేసు నమోదైంది. ఆపై అరెస్ట్ చేసి జైలుకు పంపడంతో, కొంతకాలం తరువాత బెయిల్ పై వచ్చింది. ఆపై హరనాథపురంలోని మరో హాస్టల్ లో చేరింది. ఇక్కడే ఓ బ్యాంకు ఉద్యోగిని ఏడాదిగా ఉంటుండగా, అదే రూమ్ లో దిగింది. బ్యాంకు యువతి స్నానం చేసేందుకు వెళ్లిన వేళ, సెల్ ఫోన్, ఏటీఎం కార్డు, రూ. 4 వేల డబ్బులు కాజేసి పారిపోయింది.
ఏటీఎం కార్డును ఆన్ లైన్లో వాడి షాపింగ్ చేసింది. దీన్ని గుర్తించిన ఉద్యోగిని పోలీసులను ఆశ్రయించడంతో వారు విచారణ చేపట్టారు. ఎటువంటి గుర్తింపు కార్డులు, చిరునామా పరిశీలన లేకుండా గది ఇచ్చినందుకు హాస్టల్ నిర్వాహకులపైనా కేసు నమోదు చేశారు. గతంలో పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చిన మహిళే, ఈ పని చేసినట్టు గుర్తించి, ఆమె కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.