Chandrababu: 'ఛలో ఆత్మకూరు' కార్యక్రమంలో పాల్గొని సొంతూరుకు వెళ్లే సరికి పత్తి పంట నాశనం చేశారు... మనుషులా, మృగాలా?: చంద్రబాబు ఫైర్

  • వైసీపీ సర్కారు రైతులనే లక్ష్యంగా చేసుకుంటోందంటూ ఆరోపణలు
  • దళితులను, బలహీన వర్గాలను కూడా వదిలిపెట్టడంలేదంటూ విమర్శలు
  • దళితుల జోలికెళితే ఖబడ్దార్ అంటూ హెచ్చరిక

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వైసీపీ కార్యకర్తలపై నిప్పులు చెరిగారు. కడప జిల్లా బెస్తవేముల గ్రామానికి చెందిన నల్లబోతుల నాగయ్య అనే రైతు 'ఛలో ఆత్మకూరు' కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడకు వచ్చాడని, తిరిగి అతను స్వగ్రామానికి వెళ్లేసరికి అతని పత్తి పంట నాశనం చేశారని మండిపడ్డారు. అధికారులను, పోలీసులను అడ్డంపెట్టుకుని నాగయ్య బోరును సీజ్ చేశారని ఆరోపించారు. గత 12 ఏళ్ల నుంచి ఆ ఐదెకరాల పొలమే నాగయ్య జీవనాధారమని, ఇప్పుడు దాన్ని దెబ్బతీసి, నోటికాడ తిండిని దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులనే లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగుతున్నారని, వీళ్లసలు మనుషులా, మృగాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరికి దళితులు, బలహీన వర్గాలను కూడా వదిలిపెట్టడంలేదని, దళితుల జోలికెళితే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. ఏంచేస్తారో చూస్తాం! అంటూ సవాల్ విసిరారు.

  • Loading...

More Telugu News