Congress: బీజేపీపై నిప్పులు చెరిగిన సోనియా గాంధీ
- ప్రజా తీర్పును బీజేపీ దుర్వినియోగం చేస్తోంది
- సోషల్ మీడియాలో చురుగ్గా ఉండటం కాదు!
- ప్రజా సమస్యలను పరిష్కరించండి
బీజేపీపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ నిప్పులు చెరిగారు. ఢిల్లీలో పార్టీ అంతర్గత సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సమావేశానికి సీనియర్ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. పార్టీ బలోపేతంపై, ఎన్నికల వ్యూహాలపై చర్చించినట్టు సమాచారం. ప్రజా తీర్పును బీజేపీ దుర్వినియోగం చేస్తోందని, కేవలం, సోషల్ మీడియాలో చురుగ్గా ఉండటం కాదని, ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు పరిష్కరించడం ముఖ్యమని సూచించారు. ప్రజాస్వామ్యం ఇప్పుడున్నంత ప్రమాదకర పరిస్థితిలో మునుపెన్నడూ లేదని ధ్వజమెత్తారు.
ఆర్థిక లేదా సామాజిక అంశాలపై పోరాడాలని, ప్రజలకు అండగా నిలవాలని, ఆయా సమస్యల పరిష్కారం కోసం నిర్దిష్ట ప్రణాళికను రూపొందించుకొని ముందుకెళ్లాలని తమ నాయకులకు పిలుపు నిచ్చారు. దేశంలో ఆర్థిక పరిస్థితి తిరోగమనంలో ఉందని, రోజురోజుకీ నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతోందని, పెట్టుబడిదారుల్లో విశ్వాసం సడలిపోతోందని, ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరిస్తోందంటూ దుమ్మెత్తి పోశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ నిమిత్తం అక్టోబర్ 2న భారీ పాదయాత్రను నిర్వహిస్తామని చెప్పారు.