USA: ఈ యువతి అమెరికా ‘గజినీ’.. ప్రతీ 2 గంటలకు మొత్తం మర్చిపోతుంది!
- అమెరికాలోని ఇల్లినాయిస్ లో ఘటన
- విచిత్రమైన సమస్యతో బాధపడుతున్న రైలీ
- ఎలాంటి సమస్య లేదని తేల్చిన డాక్టర్లు
ప్రముఖ నటుడు సూర్య-అసిన్ జంటగా మురగదాస్ తెరకెక్కించిన ‘గజనీ’ సినిమా గుర్తుందా? అందులో తలకు బలమైన దెబ్బ తగలడంతో సూర్య ప్రతి 15 నిమిషాలకు గతాన్ని మర్చిపోతూ ఉంటాడు. ఈ సమస్య పరిష్కారం కోసం టైమర్ ఉన్న కెమెరాను సైతం సూర్య తన దగ్గర పెట్టుకుంటాడు. అయితే ఇలాంటి ఘటనలు సినిమాలోనే కాదు.. నిజజీవితంలోనూ ఉంటాయని తాజాగా ఓ ఘటన నిరూపించింది. అమెరికాలోని ఇల్లినాయిస్ కు చెందిన రైలీ హార్నర్(16) ఈ ఏడాది జూన్ 11న డ్యాన్స్ చేస్తుండగా, తలపై బలమైన దెబ్బ తగిలింది.
దీంతో గజనీ సినిమా తరహాలో ప్రతి 2 గంటలకు అప్పటివరకూ ఏం జరిగిందో రైలీ మర్చిపోతుంది. అంతేకాదు. ఆమె ప్రతిరోజును జూన్ 11గానే గుర్తుపెట్టుకుంటుంది. దీంతో రైలీ కుటుంబ సభ్యులు ఆమెను డాక్టర్ల వద్దకు తీసుకెళ్లగా మెదడు సి.టి, ఎంఆర్ఐ స్కాన్లు తీసిన వైద్యులు, ఎలాంటి సమస్య లేదని తేల్చిచెప్పారు. అయితే, రైలీ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. అయితే తన కష్టాల విషయంలో ఈ యువతి బాధపడుతూ కూర్చోలేదు. రైలీ తన ఫోన్ లో ప్రతీ రెండు గంటలకు ఓ అలారమ్ ను సెట్ చేసుకుంటుంది.
ఓసారి అలారమ్ మోగగానే తాను రాసుకున్న నోట్స్ లో తన పేరు, ఊరు, ఉండే చోటు, తన లాకర్ గది సంఖ్య, పాస్ వర్డ్ వంటి వాటిని మననం చేసుకుంటుంది. అలాగే తన లాకర్ లో క్యాలెండర్ ను పెట్టుకుంది. మరోపక్క, కుమార్తె ఆరోగ్యం కోసం మరింత మెరుగైన వైద్యులను ఆశ్రయిస్తామని ఆమె తల్లి చెబుతోంది.