Andhra Pradesh: దేవుడి దయ వల్లే రెండోసారి వరద వచ్చింది: ఏపీ సీఎం జగన్
- జలవనరుల శాఖపై జగన్ సమీక్ష
- ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉంది
- అయినా సాగునీటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్నాం
ఏపీ జలవనరుల శాఖపై సీఎం జగన్ సమీక్షించారు. ఈ సమీక్షకు జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ఈ ఏడాది కృష్ణా వరద జలాలు బాగా వచ్చాయని, వరద వచ్చినప్పుడే ఒడిసిపట్టాలని సూచించారు. సముద్రంలోకి వరదనీరు వెళ్లకముందే కృష్ణా వరద జలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టులు నిండాలని, ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
అతితక్కువ సమయంలో భారీగా వరద వచ్చిందని, శ్రీశైలం, నాగార్జునసాగర్ నిండి వరద జలాలు సముద్రంలోకి వెళ్లాయని అన్నారు. దేవుడి దయ వల్ల రెండోసారి వరద వచ్చిందని వ్యాఖ్యానించారు. ఈ సీజన్ లో వరద వచ్చినా రాయలసీమలోని ప్రాజెక్టులను నింపడానికి చాలా సమయం పడుతోందని అన్నారు. ఎక్కడెక్కడ ఇబ్బందులు వచ్చాయో గుర్తించాలని ఆదేశించారు. వరద జలాలు ముప్పై నుంచి నలభై రోజులకు మించి ఉండవనే అంచనాతో ప్రణాళిక సిద్ధం చేయాలని, ఆ మేరకు నీటిని తరలించడానికి ఏం చేయాలో అది చేయాలని అధికారులకు సూచించారు. ముప్పై రోజుల్లో ప్రాజెక్టులు నింపే పరిస్థితి రావాలని అన్నారు.
ప్రస్తుత ప్రాజెక్టులు నాలుగేళ్లలో తప్పనిసరిగా పూర్తి కావాలి
ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా కూడా సాగునీటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్నామని, ప్రతి రూపాయిని సద్వినియోగం చేయాలని సూచించారు. సాగునీటి ప్రాజెక్టు పనుల్లో ఎటువంటి కుంభకోణాలు జరగకుండా చూసుకోవాలని, ఇప్పుడు ఉన్న ప్రాజెక్టులు నాలుగేళ్లలో తప్పనిసరిగా పూర్తికావాలని, దీని కోసం జిల్లాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుపైనా జగన్ సమీక్షించారు. ఒడిశాతో ఉన్న సమస్యల పరిష్కారానికి, ఆ రాష్ట్ర సీఎంతో చర్చలు జరిపేందుకు సన్నాహాలు చేయాలని ఆదేశించారు.
వెలిగొండ ప్రాజెక్టు పనుల గురించి జగన్ అడిగి తెలుసుకున్నారు. టన్నెల్-1, టన్నెల్-2 పనులు సహా హెడ్ రెగ్యులేటర్ పనులు వేగవంతం చేయాలని, పల్నాడు ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందించాలని ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు సహాయ పునరావాస పనులపైనా జగన్ సమీక్షించారు. సహాయ పునరావాసం కోసం ప్రత్యేక అధికారిని నియమించామని, ఇటీవల వరద బాధితులకు ఆర్ఆర్ ప్యాకేజ్ లో ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.