Medicine: రాఘవ లారెన్స్ పేరు చెప్పి దంపతులను మోసం చేసిన వ్యక్తి!
- కుమార్తెకు మెడిసిన్ సీటు కోసం ప్రయత్నిస్తున్న తల్లిదండ్రులు
- లారెన్స్ ట్రస్ట్ కు ఉపాధ్యాయుడినని పరిచయం చేసుకున్న వ్యక్తి
- రూ. 18 లక్షలు వసూలు చేసి మోసం
సెలబ్రిటీల పేరు చెప్పగానే నమ్మేసిన ఓ వ్యక్తి దారుణంగా మోసపోయాడు. తన కుమార్తె మెడిసిన్ సీటు కోసం ప్రయత్నిస్తున్న ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి, రాఘవ లారెన్స్ ట్రస్ట్ పేరు చెప్పగానే నమ్మేసి రూ. 18 లక్షలు సమర్పించుకున్నాడు. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, తమిళనాడు, రామనాథపురం, చిన్నకడై ప్రాంతంలో ఉండే అల్ అమీన్, పత్తూన్ నిషాల కుమార్తె, 'నీట్' రాయగా, తక్కువ మార్కులు వచ్చాయి.
ఈ క్రమంలో పత్తూన్ నిషా, బస్ టికెట్లను కొనేందుకు వెళ్లిన సమయంలో అక్కడ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తాను నటుడు రాఘవ లారెన్స్ నిర్వహిస్తున్న ట్రస్ట్ కు ఉపాధ్యక్షుడినని చెప్పుకున్నాడు. ట్రస్ట్ ద్వారా వూలూర్ లోని వైద్య కళాశాలలో అతి తక్కువ ధరకే సీటు వస్తుందని, అయితే కొంత ఖర్చవుతుందని చెప్పాడు.
ప్రవీణ్ మాటలు నమ్మిన అల్ అమీన్, పత్తూన్ లు, తొలుత రూ. 4.5 లక్షలు, ఆపై, మరికొంత... ఇలా అడిగినప్పుడల్లా డబ్బిచ్చి, మొత్తం రూ. 18 లక్షలు సమర్పించుకున్నారు. అయితే, ఎప్పటికీ, ప్రవీణ్ నుంచి సీటు విషయమై సరైన సమాచారం రాకపోవడం, ఆపై కనీసం మాట్లాడకపోవడంతో, తాము మోసపోయామని గ్రహించి, రామనాథపురం జిల్లా ఎస్పీ ఓం ప్రకాశ్ మీనాక్షిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో కేసు నమోదు చేసుకున్నామని, పరారీలో ఉన్న ప్రవీణ్ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.