Nallamada: భావి తరాలకు ‘బంగారు తెలంగాణ’ ఇస్తామా? యురేనియం 'కాలుష్యం తెలంగాణ' ఇస్తామా?: పవన్ కల్యాణ్
- నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై నిరసన
- ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు ఆలోచించాలి?
- ‘నల్లమల’ పరిరక్షణకు మా మద్దతు కొనసాగుతుంది
నల్లమల అడవుల్లోని అమ్రాబాద్ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన యురేనియం తవ్వకాల వల్ల పర్యావరణం దెబ్బతింటుందని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై మరోమారు ఆయన స్పందించారు. నల్లమల అడవుల పరిరక్షణకు జనసేన పార్టీ మద్దతు కొనసాగుతుందని అన్నారు.
భావి తరాలకు బంగారు తెలంగాణ ఇస్తామా? యురేనియం కాలుష్యం తెలంగాణ ఇస్తామా? అన్నది అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు ఆలోచించాలి?’ అంటూ ఓ ట్వీట్ చేశారు. కాగా, నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తమకు మద్దతు ఇవ్వాలని కోరుతూ రెండు రోజుల క్రితం పవన్ ని టీ-కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) కలిశారు. యురేనియం తవ్వకాల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముప్పు వాటిల్లుతుందని పవన్ పేర్కొన్నారు.