Andhra Pradesh: తెలుగుదేశం శిబిరంలో ఉన్నది పెయిడ్ ఆర్టిస్టులే.. ఓ ఆర్టిస్టుకు రూ.5,000 ఇచ్చారు!: జోగి రమేశ్

  • శాంతిభద్రతలను విచ్ఛిన్నం చేసేందుకు బాబు కుట్ర
  • గాలివార్తలు పోగు చేసి రాయించడం బాబుకు అలవాటే
  • గుంటూరులో మీడియాతో వైసీపీ ఎమ్మెల్యే

పల్నాడులో శాంతిభద్రతలను విచ్ఛిన్నం చేయడానికే టీడీపీ నేత చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ విమర్శించారు. ప్రజాస్వామ్యం అనే మాటను నోటి వెంట పలికేందుకు చంద్రబాబుకు అర్హత లేదని దుయ్యబట్టారు. గుంటూరులో జిల్లాలో ఈరోజు వైసీపీ నేతలతో కలిసి జోగి రమేశ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

‘ప్రశాంతంగా ఉన్న ఆత్మకూరును కలుషితం చేసేందుకు చంద్రబాబు చేపట్టిన కుట్ర ఇది. ఇక్కడ ఏమీ లేదని శిబిరాల్లో ఉన్నవాళ్లే చెప్పారు. ఈ శిబిరాలకు గిరిపురం నుంచి కూడా ఓ పెయిడ్ ఆర్టిస్టు వెళ్లారు. అతనికి టీడీపీ నేతలు రూ.5,000 ఇచ్చారు. ఇలాంటి డ్రామాలు చేసిచేసే కదా చంద్రబాబు ఈ స్థాయికి దిగజారింది. అసలు దాడులు జరిగిందన్నది నిజమే కాదు. గాలిని పోగు చేయడం, గాలివార్తలు రాయించడం చంద్రబాబుకు మామూలే’ అని జోగి రమేశ్ విమర్శించారు.

టీడీపీ అధికారంలోకి రాగానే 30 మంది వైసీపీ కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారని జోగి రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ వైఎస్ జగన్ 100 రోజుల పాలన కాలంలో ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగలేదని స్పష్టం చేశారు. ‘చంద్రబాబూ.. ఈ క్షణం మీ ఇంటి దగ్గరికి వస్తాం... నీ ఇష్టం... గురజాల, సత్తెనపల్లి... ఎక్కడికైనా నీతోనే వస్తాం. మా సవాల్‌ను స్వీకరించండి.

మీడియా సాక్షిగా మీరెక్కడికి చెప్తే అక్కడికి వెళదాం. టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు వందల కోట్ల ప్రజాధనాన్ని గనుల పేరుతో లూటీ చేశారు.  ఈ రోజు సీఎం వైఎస్‌ జగన్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంటే ఏదో జరిగిపోతోందని చంద్రబాబు హడావుడి చేస్తున్నారు. ఆత్మకూరులో ఏముంది ? పల్నాడు, ఆత్మకూరు ప్రశాంతంగా ఉన్నాయి. నువ్వే శాంతిభద్రతలకు విఘాతం కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నావు’ అని ఘాటు విమర్శలు చేశారు.

Andhra Pradesh
YSRCP
Jogi ramesh
Guntur District
Press meet
  • Error fetching data: Network response was not ok

More Telugu News