Andhra Pradesh: వైసీపీ నేతల 'ఛలో ఆత్మకూరు'కు పోలీసుల అనుమతి నిరాకరణ!
- ఛలో ఆత్మకూరు కార్యక్రమం చేపట్టిన టీడీపీ
- తెలుగుదేశానికి పోటీగా వైసీపీ మరో కార్యక్రమం
- ఇరు పార్టీలకు అనుమతి నిరాకరించిన పోలీసులు
వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం కార్యకర్తలు లక్ష్యంగా వేధింపులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమానికి టీడీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పోలీసులు ఇందుకు అనుమతి ఇవ్వకపోయినా టీడీపీ నేతలు పలు మార్గాల ద్వారా ఆత్మకూరుకు చేరుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు తెలుగుదేశం నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో అధికార వైసీపీకి కూడా గుంటూరు పోలీసులు షాక్ ఇచ్చారు. టీడీపీకి పోటీగా వైసీపీ తలపెట్టిన ‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమానికి అనుమతిని నిరాకరించారు.
శాంతిభద్రతల దృష్ట్యా వైసీపీ చేపట్టిన ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి అనుమతి నిరాకరిస్తున్నట్లు గుంటూరు గ్రామీణం పోలీసులు తెలిపారు. అంతేకాకుండా వినాయక చవితి, మొహర్రం పండుగల సందర్భంగా ఇప్పటికే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయనీ, ఇలాంటి పరిస్థితుల్లో ఛలో ఆత్మకూరుకు అనుమతి ఇవ్వలేమని తేల్చిచెప్పారు. రాజకీయ పార్టీలు తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీకి పోటీగా వైసీపీ నేతలు ఇటీవల గుంటూరు రేంజ్ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్‌ను కలిసి అనుమతి కోరారు. అయినప్పటికీ పోలీసులు వారి విజ్ఞప్తిని తిరస్కరించారు.