Congress: కర్ణాటక శాసనసభ ప్రతిపక్ష నేత పదవికి పోటాపోటీ.. పాటిల్ కే ఎక్కువ ఛాన్స్!
- రేపు ఢిల్లీలో పీసీసీ అధ్యక్షులతో సోనియా కీలక భేటీ
- కర్ణాటకలోని అసమ్మతి నేతలపై ఆగ్రహం
- నేడు ఢిల్లీకి కేపీసీసీ చీఫ్ గుండూరావు, మాజీ సీఎం సిద్ధరామయ్య
ఢిల్లీలో రేపు కాంగ్రెస్ నేతల కీలక సమావేశం జరగనుంది. అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా పార్టీని మరింత బలోపేతం చేసే చర్యలపై సోనియా పలు సూచనలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు, కర్ణాటకలో కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని పార్టీ అసమ్మతి నేతలే పడగొట్టడంపై సోనియా ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. కేపీసీసీకి కొత్త అధ్యక్షుడు, పదాధికారుల నియామకం, జిల్లాలకు నూతన అధ్యక్షులు, శాసనసభ, విధాన పరిషత్‌లో ప్రతిపక్ష నేతల ఎంపిక వంటి వాటిపై సోనియా చర్చించే అవకాశం ఉంది. సమావేశంలో పాల్గొనేందుకు కేపీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు, మాజీ సీఎం సిద్ధరామయ్య తదితరులు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు.
పార్టీకి విధేయుడిగా ఉన్న లింగాయత్ నేత హెచ్‌కే పాటిల్‌ను శాసనసభలో ప్రతిపక్ష నేత పదవికి ఎంపిక చేసే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు, మాజీ డిప్యూటీ సీఎం డీజీ పరమేశ్వర్, మాజీ మంత్రి ఆర్‌వీ దేశ్‌పాండేలు కూడా ప్రతిపక్ష నేత పదవి కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, పాటిల్‌కే ఆ పదవి అప్పజెప్పాలని పలువురు నేతలు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.