Janasena: సినీ కార్మికుల ఇళ్ల నిర్మాణం కోసం మరికొంత స్థలం కేటాయించాలి: తెలంగాణ ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ విఙ్ఞప్తి
- చిత్రపురి కాలనీలో ఇళ్లు దక్కని సినీ కార్మికులు
- స్థలం కేటాయిస్తే 30 వేల మంది కార్మికులకు లబ్ధి
- తెలుగు సినీ వర్కర్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కార్యవర్గ సభ్యులతో పవన్ సమావేశం
హైదరాబాద్ లోని చిత్రపురి కాలనీలో ఇళ్లు దక్కని సినీ కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం మరికొంత స్థలం కేటాయించాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కోరారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరికొంత స్థలం కేటాయించడం ద్వారా 30 వేల మంది కార్మికులకు గూడు కల్పించినట్టు అవుతుందని అన్నారు. స్థలం కేటాయింపు విషయమై అవసరమైతే ప్రభుత్వానికి జనసేన పార్టీ తరఫున వినతి పత్రం అందజేస్తామని చెప్పారు.
హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో తెలుగు సినీ వర్కర్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కార్యవర్గ సభ్యులతో ఈరోజు ఆయన సమావేశమయ్యారు. ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో కార్మికులు పడుతున్న ఇబ్బందులను కమిటీ ముందుకు తీసుకొచ్చారు. హౌసింగ్ సొసైటీ సభ్యులు కూడా ఇళ్ల కేటాయింపుల్లో తమ ఇబ్బందులను ఆయన దృష్టికి తెచ్చారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ‘చిత్ర పరిశ్రమ కోట్లాది మందికి వినోదం అందిస్తుంది. ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం సమకూర్చుతోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుంది. ఇలాంటి పరిశ్రమలో చాలా సాధకబాధకాలు ఉన్నాయి’ అని అన్నారు. మద్రాసు నుంచి హైదరాబాద్ కు చిత్రపరిశ్రమను తరలించే సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి నాలుగు వేల మంది కార్మికులకు ఇళ్ల నిర్మాణం కోసం 67.16 ఎకరాలు కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు చిత్ర పరిశ్రమ చాలా పెద్దది అయిందని, దాదాపు 35 వేల మంది కార్మికులు ఈ పరిశ్రమను నమ్ముకుని ఉన్నట్టు చెప్పారు.
ప్రభుత్వం కేటాయించిన స్థలం సరిపోవడం లేదని, ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని మరికొంత స్థలం కార్మికుల గూడు కోసం కేటాయించాలని విఙ్ఞప్తి చేశారు. అలాగే చిత్రపురి కాలనీ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసి మిగిలి ఉన్న మూడు ఎకరాల స్థలంలో ఇళ్లు లేని కార్మికుల కోసం వాటిని నిర్మించాలని కోరారు.
అనంతరం, తెలుగు సినీ వర్కర్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్, ప్రముఖ మాటల రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, నాలుగు వేల మందికి సరిపడ స్థలాన్ని నలభై వేల మందికి సర్దడం చాలా కష్టమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అర్ధించి, పక్కనే ఉన్న తొమ్మిదిన్నర ఎకరాల స్థలం ఇవ్వాలని కోరామని, ప్రభుత్వ పెద్దలు కూడా ఆ స్థలాన్ని పరిశీలించి ఇస్తామని హామీ ఇచ్చినట్టు చెప్పారు. తమ తరఫున పవన్ కల్యాణ్ కూడా ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేస్తే వేలాది మంది పేద కార్మికులకు గూడు కల్పించినవారవుతారని అన్నారు. చిత్రపురి కాలనీ కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఇంకా మూడున్నర ఎకరాల స్థలం మిగిలి ఉందని, అందులో, వీలైనన్ని ఎక్కువ ఇళ్ళు నిర్మించి పేద కార్మికులకు అందజేస్తామని హామీ ఇచ్చారు.