Sri Lanka: పాకిస్థాన్ వెళ్లేందుకు వెనుకంజ వేసిన శ్రీలంక క్రికెటర్లు... భారతే కారణమంటున్న పాక్ మంత్రి
- పాక్ టూర్ కు వెళ్లబోమని ప్రకటించిన 10 మంది లంక క్రికెటర్లు
- వింత వాదన చేస్తున్న పాక్ మంత్రి
- లంక క్రికెటర్లను భారత్ బెదిరిస్తోందంటూ ఆరోపణలు
పాకిస్థాన్ పర్యటనకు వెళ్లేందుకు 10 మంది శ్రీలంక క్రికెటర్లు విముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. లసిత్ మలింగ, ఏంజెలో మాథ్యూస్, దిముత్ కరుణరత్నే వంటి స్టార్ ఆటగాళ్లు భద్రతా కారణాల రీత్యా పాక్ టూర్ కు వెళ్లరాదని నిర్ణయించుకున్నారు. అయితే, దీనిపై పాకిస్థాన్ శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన శాఖ మంత్రి ఫవాద్ హుస్సేన్ చౌదరి వింత వాదనను తెరపైకి తెచ్చారు.
పాక్ పర్యటనకు వెళ్లొద్దంటూ శ్రీలంక క్రికెటర్లను భారత్ బెదిరిస్తోందని ఆరోపించారు. పాక్ టూర్ కు వెళితే ఐపీఎల్ కాంట్రాక్టులు రద్దు చేస్తామని హెచ్చరించినట్టు కొందరు క్రీడా వ్యాఖ్యాతల నుంచి సమాచారం అందిందని చెప్పారు. ఇది నిజంగా చవకబారు చర్య అని, క్రీడలు మొదలుకుని అంతరిక్షం వరకు భారతదేశానిది యుద్ధోన్మాదం అని, దాన్ని తప్పకుండా ఖండించాల్సిందేనని వ్యాఖ్యానించారు.