Mopidevi: వరద రాజకీయాల్లో ఫెయిలవడంతో పల్నాడు డ్రామాకు తెరలేపారు: చంద్రబాబుపై మండిపడ్డ మంత్రి మోపిదేవి
- గుంటూరులో మంత్రి మీడియా సమావేశం
- టీడీపీ ఉనికి కాపాడుకునేందుకే చంద్రబాబు ప్రయత్నాలంటూ విమర్శలు
- తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ నిప్పులు చెరిగారు. గుంటూరులోని తాజ్ ఓల్డ్ విజయకృష్ణ హోటల్ లో వైసీపీ ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వరద రాజకీయాల్లో విఫలం కావడంతో చంద్రబాబు పల్నాడు వేదికగా మరో నాటకానికి తెరలేపారని ఆరోపించారు. టీడీపీ ఉనికి చాటుకోవడం కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబుది దుర్మార్గమైన మనస్తత్వం అని, ఏపీ సీఎం జగన్ చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కుతంత్రాలకు పాల్పడుతున్నారంటూ విమర్శించారు.
రాష్ట్రంలో ఎంతో ప్రశాంత వాతావరణం ఉంటే, అసందర్భ ప్రేలాపనలు, పొంతనలేని ప్రకటనలతో చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలను, నేతలను వైసీపీ వాళ్లు వేధిస్తున్నారని, హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని అంటూ చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి నీచ రాజకీయాలను చంద్రబాబు ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు.