Facebook: అమ్మాయిల వివరాలు బట్టబయలు... ఏకాంతంగా గడిపిన సమాచారం ఫేస్ బుక్ చేతిలో!

  • స్మార్ట్ ఫోన్లలో సాధారణమైపోయిన యాప్స్
  • తమ ఆరోగ్యం నిమిత్తం వివరాలు పంచుకుంటున్న యువతులు
  • సమాచారాన్ని ఫేస్ బుక్ కు చేరవేస్తున్న మాయా, మియా ఫెమ్
  • సంచలన నివేదికను వెలువరించిన ప్రైవసీ ఇంటర్నేషనల్

తమ ఆరోగ్యంపై శ్రద్ధతో అమ్మాయిలు స్మార్ట్ ఫోన్లలో లోడ్ చేసుకుంటున్న యాప్స్, ఇప్పుడు వారి పరువు తీసేలా తయారయ్యాయి. ప్రస్తుతం అందుబాటులో వున్న యాప్స్ లో కనీసం రెండు నెలసరి ట్రాకింగ్ యాప్స్.. తాము సేకరించిన అమ్మాయిల వివరాలను, వారు చివరిసారిగా లైంగిక చర్యలో ఎప్పుడు పాల్గొన్నారన్న విషయాలను ఫేస్ బుక్ కు చెప్పేస్తున్నాయి.

అమ్మాయిల స్మార్ట్ ఫోన్లలో సాధారణమైనపోయిన 'మాయా', 'మియా ఫెమ్' యాప్స్ ఈ పని చేస్తున్నాయి. వాస్తవానికి ఇవి మహిళలకు ఎంతో ఉపయుక్తమైనవని పేరు తెచ్చుకున్న యాప్స్, వీటిల్లో ఒకసారి నెలసరి వచ్చిన తేదీని ఎంటర్ చేస్తే, ఆపై తదుపరి నెలసరి ఎప్పుడు వస్తుందన్న అంచనాలను, అప్పుడు ముందుగానే తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెప్పేస్తాయి. ఇదే సమయంలో ఎవరితోనైనా కలవాలని భావిస్తే, ఎప్పుడు కలిస్తే సురక్షితమన్న విషయాన్నీ చెబుతాయి. అంతవరకూ బాగానే ఉంది. యూజర్లు ఎంటర్ చేసే వివరాలను ఈ యాప్స్ ఫేస్ బుక్ కు అందిస్తున్నాయని తాజా నివేదిక సంచలన విషయాన్ని వెలుగులోకి తెచ్చింది.

బ్రిటన్ కు చెందిన ప్రైవసీ ఇంటర్నేషనల్ ఓ అధ్యయనం చేయగా, ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. యువతులు తమకు చెందిన వివరాలను ఈ యాప్ లో స్వయంగా పొందుపరచుకుంటున్నారని, ఎప్పుడు లైంగిక చర్యలో పాల్గొన్నాం... ఎటువంటి గర్భ నిరోధక సాధనాలను వాడాము... ఆ సమయంలో మానసిక స్థితి ఎలా వుంది? తదితర వివరాలను అమ్మాయిలు ఫీడ్ చేసుకుంటుండగా, అవన్నీ సురక్షితంగా లేవని తెలిపింది. ఈ సమాచారం బీమా కంపెనీలకు, వ్యాపార సంస్థలకు సులువుగా చేరిపోతోందని పేర్కొంది. వీరంతా ఫేస్ బుక్ అడ్వర్టయిజింగ్ నెట్ వర్క్ ను వాడుకుని అమ్మాయిల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూస్తున్నారని ఆరోపించింది. ఈ యాప్స్ ఇన్ స్టాల్ చేయగానే ఫేస్ బుక్ కు సమాచార బట్వాడా ప్రారంభం అవుతోందని తెలిపింది.

ఇక ఈ రిపోర్టుపై స్పందించిన ఫేస్ బుక్ ప్రతినిధి జోయ్ ఓస్ బోర్న్, వ్యాపార ప్రకటనకర్తలకు ఈ సున్నిత సమాచారం ఏదీ వెళ్లబోదని అన్నారు. యాప్స్ ద్వారా షేర్ చేసుకునే సమాచారం సురక్షితమని అన్నారు. అడ్వర్టయిజర్స్ కేవలం యూజర్ల ఆసక్తిని గమనించి, వారిని లక్ష్యంగా చేసుకుని తమ ఉత్పత్తులకు ప్రచారం చేసుకుంటారని అన్నారు.

  • Loading...

More Telugu News