Nagarjuna Sagar: నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత... మరోసారి ఉండవల్లి కరకట్టకు ముప్పు!

  • 16 గేట్లను ఎత్తిన అధికారులు
  • దిగువకు 1.50 లక్షల క్యూసెక్కుల నీరు
  • లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం

శ్రీశైలం నుంచి వస్తున్న వరద ప్రవాహం గంటగంటకూ పెరుగుతూ ఉండటంతో, కొద్దిసేపటి క్రితం నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లను అధికారులు తెరిచారు. ఈ ఉదయం 2.60 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తుండటం, నీటిని నిల్వ చేసే వీలు లేకపోవడంతో 16 గేట్లను ఐదు అడుగుల మేరకు ఎత్తిన అధికారులు 1.50 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. సాగర్ గేట్లు ఎత్తగానే, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశామని అధికారులు వెల్లడించారు. సహాయక బృందాలను ముంపు ప్రాంతానికి పంపామని తెలిపారు.

కాగా, ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 80 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండగా, నేటి సాయంత్రానికి అది 3 లక్షల క్యూసెక్కులను దాటే ప్రమాదం ఉండటంతో, ఉండవల్లి కరకట్ట మరోసారి ముంపు ప్రమాదంలో చిక్కుకుంది. వరదను దృష్టిలో ఉంచుకుని, భవానీ ద్వీపానికి యాత్రికుల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. గత నెలలో కృష్ణానదికి భారీ వరద వచ్చిన వేళ, కరకట్టపైనే ఉన్న చంద్రబాబు నివాసం మెట్ల వరకూ నీరు వెళ్లిన సంగతి తెలిసిందే.

Nagarjuna Sagar
Gates
Krishna River
Flood
  • Loading...

More Telugu News